Sunday, July 8, 2018

తుంబుర తీర్థం | Unknown Facts About Tumburu Theertham | తుంబుర తీర్థం తిరుమల లోనే ఎందుకుందో తెలుసా








------

తిరుమల గిరులపై నెలకొని ఉన్న పవిత్ర తీర్థములలో తుంబుర తీర్థం చాలా ప్రశస్తమైనది. కొండపైగల పాపవినాశ తీర్థం నుండి సుమారు 8 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. పాపవినాశ తీర్థం నుండి సంవత్సరములో 3 రోజులుమాత్రమే (ఫాల్గుణ పౌర్ణిమ నాడు) ఈ తీర్థానికి వెళ్ళడానికి అనుమతిస్తారు. ఈ సంత్సరం ఈ తీర్థానికి వెళ్లే అవకాశం కలిగింది. తుంబుర తీర్థం గురించి శ్రీ P V R K ప్రసాద్ గారు తమ తిరుమల లీలామృతము అనే పుస్తకములో వ్రాసిన వ్యాసం మీరు ఇచట చదువగలరు. అలానే వెంకటేశ్వర భక్తి చానల్ వారు తుంబుర తీర్థంపై రూపొందిచిన చక్కటి డాక్యుమెంటరీని ఇక్కడ చూడవచ్చును.


ప్రాచీన బర్హి ఒక మహారాజు... అతనికి యఙ్ఞాలు చేసే అభిలాష చాలా ఎక్కువ... ప్రపంచమంతా దర్భలను పెంచి ఎప్పుడూ యఙ్ఞాలు చేయడమే కర్తవ్యంగా పెట్టుకొన్న కర్మయోగి. 


ఒకనాడు గాన గంధర్వుడు తుంబురుడు ఆ రాజ్యానికి వచ్చి, ఆ రాజు చేసిన, చేస్తున్న యఙ్ఞ కర్మలు చూచి, చాలా సంతోషించి,ప్రాచిన బర్హిని ఎంతో శ్లాఘించాడు. "నీవంటి రాజు భూమండలంలోనే లేడు ఎన్ని యఙ్ఞాలు చేశావు! నీ వంటి గొప్ప వాడింకొకడు లేడు. నీలాగా దానాలు చేసిన వారుకాని, ధర్మాలు చేసినవారు కానీ బ్రాహ్మణులకు సంతర్పణలు చేసినవాడు గాని ఇంకొకరు లేడు. నీవు వీర, శూర, దానశిఖామణివి" అని పొగిడాడు. ప్రాచీనబర్హిని అంతగా పొగడడానికి ఇంకొక కారణం కూడా ఉంది. ప్రాచీనబర్హి దగ్గర ఒక విశేష వీణ ఉంది. అది నవరత్నఖచితం. మణిమాణిక్యాలు పొదగబడిన చాలా అరుదైన, ఖరీదైన అద్భుత వీణ. దాన్ని పొందడంకోసం, మానవమాత్రుడైన ప్రాచీనబర్హిని గానగంధర్వ ముఖ్యుడైన తుంబురుడు ఉత్ర్పేక్షలతో, పొగడ్తలతో ముంచెత్తాడు. అలా పొగిడి ఆ వీణను ఆ రాజునుండి పొందాడు.


ఆ వీణ తీసుకొని నారద ముని వద్దకు వచ్చాడు. ఆ వీణను చూచి జరిగిన విషయమంతా తెలుసుకొన్న నారదులవారికి చాలా కోపం వచ్చింది." అయ్యో, భగవంతుని పొగడాల్సిన, సేవించాల్సిన మనం, మానవమాత్రుడైన ప్రాచీనబర్హిని పొగడడమేమిటి? అందున కామ్యాపేక్షతో అటువంటి నీచపు పని చేసిన నీవు దండార్హుడవు... ఆకాశమార్గంలో సంచరించే శక్తి గల గంధర్వుడవు. మన విద్య ప్రతిభ , శక్తియుక్తులు భగవంతుని ఆరాధనకే గాని ఉదరపోషణకుగాని, స్వలాభాపేక్షకుగాని కాదు. ఇలా అన్యథా లాభంకోసం నరస్తుతి చేసిన నీకు ఆకాశమార్గంలో వెళ్లే అర్హతపోయి భూలోకంలో జన్మించు" అని శపిస్తాడు. ఆ నారదశాపం ఒకరకంగా తుంబురుని ఉద్ధారానికే... 


తుంబురుడు స్వతహాగా సాత్వికుడు, భక్తుడు, యోగ్యుడు... ప్రారబ్ధం వల్లనో, క్షణిక అఙ్ఞానం వల్లనో, తాత్కాలిక అసురావేశంతోనో, ఈ తప్పు చేసినా భగవదనుగ్రహం ఉంది కనుక, భులోకంలో శ్రీ వేంకటాచలంలో ఘోణతీర్థం దగ్గర పడ్డాడు. అక్కడ తీర్థంలో రోజూ స్నానం చేసి తపస్సు చేసుకొంటూ ఉంటాడు. 


అలా తీర్థస్నాన, తపాలు చేస్తున్న తుంబురునికి ఫాల్గుణ మాసంలో భగవంతుని ప్రత్యక్షం జరుగుతుంది. భగవంతుడొక్కడే కాకుండా బ్రహ్మది దేవతలతో సహా వస్తాడు. వారందరినీ అ ఘోణాతీర్థంలో స్నానం చేయమంటాడు భగవంతుడు. వారితోపాటు తుంబురుని కూడా స్నానం చేయమంటాడు. అంతటితో తుంబురునికి శాపవిముక్తి కలిగి తన గంధర్వరూపం, ఆకాశయాన శక్తి ఇతర గంధర్వశక్తులు ముఖ్యంగా మాధుర్యంగా గానం చేసే శక్తి తిరిగి వస్తాయి. 


భగవంతుని తుంబురుడు తాను ఉద్ధారమైన ఆ తీర్థానికి తన పేరు ఉండాలని కోరతాడు. భగదిచ్ఛ వల్ల అప్పటినుండి ఆ తీర్థానికి ఘోణాతీర్థం బదులు తుంబురుతీర్థంగా ప్రసిద్ధి వచ్చింది. అలా తుంబురుడు కోరడానికి రెండు కారణలు. దేవతలు, మహాత్ములు, ఙ్ఞానులు ఆ తీర్థంలో స్నానం చేసినప్పుడు తన పేరు చెప్పుకుంటే, వారిపుణ్యంలో భాగం, తనకంటే తక్కువవారు స్నానంచేసి తన పేరు తల్చుకుంటే వారికి పుణ్యం కల్గించే భాగ్యం అదొక పుణ్యం. ఇది చాలా మహాత్మ్యం గల తీర్థం. సకలదేవతలు భగవంతుని సమక్షంలో స్నానం చేసిన తీర్థం. ఆ తీర్థానికి వెళ్లి స్నానం చేయకుండా వస్తే ఈ తీర్థాన్ని తిరస్కరించినందుకు పంచమహా పాతకాలు చుట్టుకుంటాయని వరాహాపురాణం చెబుతుంది. స్నానం చేస్తే ఈ పాతకాలు పొతాయి. 


ఈ తుంబురుడు భగవంతుని అనుగ్రహం ప్రత్యేకంగా ఇంకొకసారి పొందుతాడు. ఒకసారి కుబేరుని ఆఙ్ఞానుసారం చాలా తొందరలో రంభ కుభేరుని దగ్గరకు వెళ్తుంటే దారిలో తుంబురుడు ఆపుతాడు. సంగతి చెప్పినా వినక బంధిస్తాడు. కుబేరుడు కోపంతో కదలలేని రాక్షసుడవు కమ్మని శాపాన్నిస్తాడు. అలా విరాధుడనే రాక్షసునిగా జన్మ తీసుకుంటాడు. రాములవారి అనుగ్రహంతో శాపవిమోచనమౌతుంది. భరతకాలంలో 'సంజయుడి' గా అవతారం చేసి ధృతరాష్ర్టుని సారథిగా వుండి భగవదనుగ్రహంతో దివ్యదృష్టి కలిగి కురుక్షేత్ర యుద్ధమంతా దూరదర్శనం చేసి ధృతరాష్ర్టునికి వినిపించినవాడే ఈ తుంబురుడు.


ఈ తుంబుర క్షేత్రమహిమ గురించి వరాహపురాణంలో ఇంకొక సంఘటన వివరించబడింది. ఈ తుంబురుతీర్థ మహిమ గురించి గార్గిఋషి దేవతలఋషిని, ప్రశ్నిస్తాడు. 


తుంబురుడు శాపవిమోచనమైనాక ఒక మాఘమాసం తెల్లవారకుండానే లేచి, మాఘస్నానం చేసి పూజదేవతార్చనకు సిద్ధమవుతాడు. తన భార్య ఇంకా నిద్ర పోతుండడంచూచి, ఆమెను లేపి, మాఘమాస పవిత్రస్నానం చేసి తను పూజకు సిద్ధం చేయమంటాడు. మాఘమాసంలో చలి, ముఖ్యంగా తెల్లవారుజామున ఇంకా ఎక్కువ, భార్య బద్ధకిస్తుంది. సకాలంలో స్నానం చేసి పూజకు సదుపాయం చెయ్యదు.


తుంబురుడు కోపించి కప్పవై నీరులేని చోట పడి వుండి దుఃఖం అనిభవించమని శాపం ఇస్తాడు. ఆమె చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో భర్తను శాపవిమోచనం చెప్పమని ప్రార్థిస్తుంది. సరే అని విమోచనం ఎలా అవుతుందో కూడా చెబుతాడు. 


అలా ఆమె ఒక అశ్వత్థవృక్షం వేళ్లలో నరకయాతన పడుతూ వేయి సంవత్సరాలు జలాధారం లేకుండా వ్యథ అనుభవిస్తుంది. ఒకనాడు అగస్త్యముని యాత్రకు వెళ్తూ ఆ అశ్వత్థవృక్షం నీడలో వుండి తన శిష్యులకు వేంకటాచలంలోని తుంబురు తీర్థమహిమ వర్ణన చేస్తాడు. అక్కడే వేళ్లల్లో ఉన్న ఆ కప్పకు తుంబురతీర్థ మహిమ శ్రవణంతో శాపవిమోచనమై అగస్త్యునికి నమస్కరించి ధన్యవాదాలు తెలుపుతుంది. 


అగస్త్యులు ఆమెకు పాతివ్రత్యధర్మాలు, పతిమాట జవదాటకూడదన్న ధర్మవిషయాలు చెప్తాడు. పతి అధర్మపరుడై, నిషిద్ధకర్మలు చేయమని ఆదేశిస్తే పత్ని అటువంటి ఆఙ్ఞ పతి ఆఙ్ఞ అయినా తిరస్కరించవచ్చని కూడా చెప్తాడు - పతి ధార్మికుడై భగవంతుని అర్చనకు సహాయం అడిగినప్పుడు, నిర్లక్ష్యం చేయడం పతివ్రతాదర్మం కాదని చెప్పి - ఆమెను ఆశీర్వదించి పంపుతాడు.


ఇలా తుంబురతీర్థ మహిమ వింటేనే పాప నాశనమైతే, తుంబురతీర్థంలో స్నానం చేస్తే ఎంత మహిమో చెప్పాలా ?


కానీ ఈ స్నానాలు, ఙ్ఞానంతో చేయాలి. తీర్థమహిమ తెలుసుకొని చేయాలి. ఏ నీళ్లన్నా స్నానం చేయాల్సిన అవసరం ఉంది కనుక స్నానం చేస్తే అంత ఫలం రాదు. మహిమ తెలుసుకొని, స్నానం చేసేప్పుడు ఆ తీర్థమహిమ తలచుకొని, ఎవరెవరు ఈ తీర్థంలో తరించారో వారిని స్మరించుకొని, తాను చేసిన పాపాలకు పశ్తాత్తాపం చూపిస్తూ చేసిన స్నానఫలం కృష్ణార్పణమస్తు అని శ్రీనివాసునికి సమర్పిస్తే - ప్రక్షాళన కాని పాప ముండదు. రాని పుణ్యముండదు.


అరుంధతీ దేవి కూడా 12 సంవత్సరాలు ఈ తుంబురతీర్థంలో ప్రతి రోజూ స్నానం చేసి తపస్సు చేసిందని పురాణం చెబుతుంది. భగవంతుడు ప్రత్యక్షమై, ఏమి వరం కావాలంటే - ఆమె "ఈ తుంబురతీర్ధమహిమాఙ్ఞానం నాకు పూర్తిగా కలిగితే చాలు" అంటుంది... అంతటి మహిమ కల్గినది ఈ తీర్థం. అరుంధతికి తెలుసు ఈ తీర్థంలో భగవంతుని విశేష సన్నిధానం వుందని, దానితోపాటు భగవంతుని ఆఙ్ఞతో సకల దేవతాసన్నిధానం కూడా ఇక్కడ వుంది కనుక ఇది మోక్షమిచ్చే శక్తిగల తీర్థమని అర్థం చేసుకోవాలి. అవకాశం తెచ్చుకొని, జన్మలో ఒక్కసారైనా, ఈ తీర్థానికి వెళ్లి శ్రద్ధతో స్నానం చేస్తూ, ఈ తుంబురుతీర్థమహిమా పారాయణం చేస్తే, పాతివ్రత్యఫలం వస్తుంది. ముఖ్యంగా పతివాక్య ఉల్లంఘనా దోషం పోతుంది. ఈ రోజుల్లో పతివాక్యం ఏదో సమయంలో ఉల్లంఘన చేయని పత్నులు అరుదుగదా? ఈ తీర్థస్నానం చాలా అవసరం!!


అన్నమయ్య కీర్తన "మనుజుడై పుట్టి, మనుజుని సేవించి.... దుఃఖమందనేల" అన్నది విన్నాం కదా! ఈ మానవజన్మ భగవంతుని గుణగానం చేయడానికి గాని, ఇతరులను పొగడటానికి కాదని తుంబురుని కథ సూచిస్తుంది. 


తరిగొండ వెంగమాంబ భర్త పోయినా, 'విధవత్వం' తీసుకోకుండా సుమంగళిగా ఉండి, సమాజ ఆక్షేపణకు గురై, తరిగొండ వదిలి తిరుమల వస్తుంది. అక్కడ కూడా అర్చకాదుల తిరస్కారానికి, క్రోధానికి గురైనప్పుడు ఈ తుంబురతీర్థానికి వచ్చి, ఇక్కడ ప్రతిరోజూ స్నానం చేస్తూ ఒక దశాబ్ద కాలం తపస్సు చేసింది.. అలా పొందిన పుణ్యంతోనే ఙ్ఞానం, భక్తి, వైరాగ్యం సంపాదించి, స్వామివారిపై రచనలు చేసి, పీఠాధిపతులను సైతం కట్టడి చేయగల శక్తి సామర్థ్యాలు సంపాదించింది. ఇప్పటికీ తరిగొండ వెంగమాంబ నివసించిన ప్రదేశంగా తుంబురతీర్థంలో ప్రసిద్ధిచెందిన స్థలం చూడవచ్చు. ఆమె సమాధిని కూడా తిరుమలకొండపై ఈనాటికీ చూడవచ్చు. ఈసారి తిరుమల వెళ్లినప్పుడు చూడటానికి ప్రయత్నం చేయండి.


ఈ తీర్థం స్వామివారి దేవాలయానికి ఉత్తరదిక్కులో దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. మాఘ (మార్చి - ఏప్రిల్ ) పౌర్ణమిరోజు ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో స్నానం మహా విశేషం. ఆ రోజు ముక్కోటి దేవతలు, బ్రహ్మదేవునితో సహా ఈ తీత్థంలో స్నానం చేస్తారు. అందుకే దీనిని ఫల్గుణీతీర్థం అని కూడా అంటారు. దేవస్థానం నుండి పూజా నైవేద్యం జరుగుతుంది.

No comments:

Post a Comment