Thursday, July 5, 2018

అగ్నికార్యము | Agnikaryam | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu


అగ్నికార్యము | Agnikaryam | Sandhya Vandanam | Sandhya Namaskaram | Agnikaryam | Brahma Yagnam |  Eating Prayer | Bhojana Vidhi or Parishechana - Eating Procedure With Sanskrit Prayer | Aupasana | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu | Bhakthi Pustakalu | Bhaktipustakalu | Bhakti Pustakalu | BhakthiBooks | MohanBooks | Bhakthi | Bhakti | Telugu Books | Telugubook


అగ్నికార్యము


పరాశరులు ద్విజుల కర్తవ్యములను గురించి ఇలాగంటారు


|| అగ్నికార్య పరిభ్రష్ఠా స్సంద్యౌపాసన వర్జితాః | వేదం చ యేనధీయానాస్తే సర్వే వృషలాస్మృతాః ||


" అగ్నికార్యము సంధ్యావందనము , బ్రహ్మ యజ్ఞము , వైశ్వదేవము , ఔపాసనము , వేదాధ్యయనము --వీటిని వదలిన ద్విజులు ’ వృషలులు ’ అనబడతారు. వృషలుడనగా పతితుడు. అట్టివానికి సమాజమున గౌరవముగానీ ఇతర శుభ కర్మలు చేయు అధికారము గానీ ఉండదు.ఇవి చేయుట వలన గౌరవము , అధికారమే కాకుండా అనేక ఇతర విశేషమైన మహోపయోగములు కూడా కలవు.


మొదటిదైన ’ అగ్ని కార్యమును ’ గురించి తెలుసుకుందాము. దీనినే ’ సమిదాధానము ’ అనికూడా అంటారు. బ్రహ్మచారులు చేయునది సమిదాధానము. గృహస్థులు చేయునది ’ ఔపోసనము ’


అగ్నికార్యమనగా అగ్నిని వెలిగించి చేయు ఏదో ఒక కార్యము కాదు. బ్రహ్మచారి అగ్ని ( యజ్ఞేశ్వరుని యొక్క ) పరిచర్యను చేయుటనే అగ్నికార్యము అందురు. పూర్వము మృత్యుదేవత బ్రహ్మచారులను పట్టి పీడించేది. ఆ మృత్యువు బారి నుండీ బ్రహ్మచారులు పడకుండా అగ్నిదేవుడు వారిని వరమిచ్చి కాపాడినాడు. కాబట్టి మృత్యు దేవతనుండీ బ్రహ్మచారులను కాపాడి ఉద్ధరించిన అట్టి అగ్నిదేవుని పరిచర్య చేయుట బ్రహ్మచారుల విధి. అగ్నికార్యము వదలిన బ్రహ్మచారులను సమిధలుగా మృత్యువు తీసుకొనును. ( అగ్నికార్యమును వదలిపెట్టిన బ్రహ్మచారులకు ప్రాయశ్చిత్తంగా ’ మితాక్షరి ’ , చంద్రిక ’ , ’ ఋగ్విధానము ’ యను గ్రంధములలో తీవ్ర విధానములు విధింపబడినవి. ఒకసారి మానేస్తే శివాలయం లో ’ మానస్తోకే ’ మంత్రాన్ని నూరు సార్లు జపించవలెను. సంధ్య , అగ్నికార్యములను వదలిన వాడు ఎనిమిది వేల గాయత్రీ జపాన్ని చేయవలెను. )


జపము , తపము , స్తోత్రము , అర్చన , పూజ వీటన్నిటికన్నా హోమము చేయుట వలన అతి శీఘ్రముగా ఫలితములు కలుగును. దీనికి కారణమేమనగా , పైవాటిని అనుష్ఠించునపుడు మన మనస్సును నిశ్చలముగా భగవంతుని పైనే కేంద్రీకరించుట అతి కష్టము. అనేక విధములైన ఆలోచనలతో చేయు ఆ పూజలు భగవంతునికి చేరుటకు కఠోర దీక్ష అవసరము. అయితే , హోమములోని విశేషమేమనగా , మనము హవ్యములను ఆహుతి ఇచ్చిన మరుక్షణమే అవి యజ్ఞేశ్వరునికి అందును. ఆ ఆహుతులను యజ్ఞేశ్వరుడు హవ్య కవ్యములుగా మార్చి మనము ఉద్దేశించిన దేవతలకు అందించును. అందువలన హోమము అతి ఉపయుక్తమైన అనుష్ఠానము.


హోమమనిన మరియేమో కాదు , మానవులు , దేవతల మధ్య ఒక ఒడంబడిక. మనకు కావలసిన అనేక శుభములను దేవతలు లిప్తకాలములో ఇవ్వగల సమర్థులు. వారు చేయునదెల్లా మన మనసులను ప్రేరేపించుటయే. మనకు ఏ కార్యము కావలెనన్ననూ , ఇంకొకరి అవసరము తప్పదు కదా, అలాగ అందరి మనసులను మనకు అనుకూలముగా మార్చగల శక్తి కలవారు. అయితే దేవతలకు కావలసిన హవ్య కవ్యములు వారికి అతి దుర్లభములు. మన వలె వారు భోజనము చేయలేరు. నీటిని త్రాగలేరు. కేవలము వారికని సంకల్పించి ఎవరైనా సమర్పిస్తే , వాటిని చూచి గానీ , ఆఘ్రాణించి గానీ తృప్తి పడతారు. వాటిని సంపాదించుటకు వారికి దేహము లేదు, అనగా మానవుడికి వలె పాంచభౌతికమైన దేహము లేదు. కనుక అవి మానవులు మాత్రమే వారికి ఇచ్చుటకు సమర్థులు. ఈ రహస్యమును తెలుసుకొని , అందరూ దేవతలను ఆరాధించునది అందుకే.


అగ్ని కార్యము చేయుట వలన , అతి గొప్పవైన బ్రహ్మ వర్చస్సు, మేధ , బుద్ధి , తేజస్సు, పరివారము , ఇంద్రియ పుష్టి , బలము , సంపదలు మొదలగునవి కలుగుతాయి. అగ్నికార్యము చేయువానిని చెడుశక్తులు తేరిపారి కూడా చూడలేవు. ఇతరుల పాపపు దృష్టి వారిపై పడదు.


క్రమము తప్పక అగ్నికార్యమును చేయు బ్రహ్మచారి మేధస్సును , తేజస్సును , వర్చస్సును చూచినచో అతనికి సర్వులూ వశము కావలసినదే. అనగా , అతడిని అందరూ అభిమానముతో ఆరాధించెదరు.
అగ్నికార్యము చేయుట నేర్చుకొన్న తర్వాత , రోజూ చేస్తూ ఉంటే , అలవాటు అయిపోయి అయిదు నిముషములకన్నా ఎక్కువ తీసుకోదు. మొదట్లో ఎక్కువ సమయము పట్టవచ్చును. కాబట్టి శ్రద్ధ ఉన్నవారు తీరిక సమయములో మొదట నేర్చుకొని తరువాత అనుష్ఠించవచ్చును. ( వీలైతే ఇందులోని మంత్రములను పలికి ఆడియో ఫైల్ గా ఇవ్వగలను )


అగ్నికార్యము నిత్య నైమిత్తిక కార్యముకోవకు వస్తుంది. అనగా ,ఏ కర్మను తప్పనిసరిగా ప్రతిదినమూ చేయవలెనో , ఏ కర్మను చేయకపోతే దానికి ప్రత్యవాయము కలదో అది నిత్య కర్మ. నైమిత్తికమనగా విశేష దినములలో చేయవలసిన కార్యములు. ఉపాకర్మ , శ్రాద్ధములు , అమావాస్య , గ్రహణ ఇత్యాది తర్పణములు మొదలైనవి.


అగ్ని కార్యములో ఉపయోగించవలసిన సమిధలు : అగ్నికార్యము చేసిన ప్రతిసారీ పద్ధెనిమిది సమిధలు అవసరమగును. శమీ ( జమ్మి ) , పలాశ ( మోదుగ ) , వైకంకత ( వెలగ ) , అశ్వత్థ ( రావి ) , ఔదుంబర ( మేడి , అత్తి ) , బిల్వ ( మారేడు ) , చందన ( గంధపు చెక్క ) , శాల ( సాల ) , దేవదారు , ఖాదిర ( చండ్ర ) ఈ చెట్ల లో ఏదో ఒక చెట్టు సమిధనైనా , లేదా అనేక చెట్ల సమిధలనైనా వాడ వచ్చు. ఈ సమిధలు బొటన వేలికన్నా లావు ఉండరాదు , పైన బెరడు తీసి ఉండరాదు, పురుగులు , చెదలు పట్టి ఉండరాదు , జుత్తెడు ( జానెడు కన్న కొంచము ఎక్కువైన , అనగా ఆరు అంగుళాలైనా ఉన్నది ) పొడవు ఉండవలెను. చీలి కాని , రెండు కొమ్మలుగా గానీ ఉండరాదు. ఆకులతో చేరి ఉండరాదు. పూర్తిగా ఎండిపోయి కృశించి ఉండరాదు. వంకర తిరిగి ఉండరాదు. కణుపులు ఉండరాదు. అటువంటి సమిధలనే వాడవలెను.


ఇవేవీ దొరకని పక్షములో చివరికి దర్భలను కూడా వాడ వచ్చును కానీ అగ్నికార్యమును చేయుట మానరాదు అని కొందరి మతము.


విశేష నియమములు : అగ్ని కార్యము చేయుటకు ఒక స్థండిలము కావలెను. అనగా హోమ కుండము. దీనిని ఇటుకలతో చేసుకొన వచ్చును. లేదా ఈ మధ్య వాడుటకు సిద్ధముగా ఉన్న అనేక లోహపు స్థండిలములు దొరకుచున్నవి. దానిలోపల ఇసుక వేసి , పైన కొద్దిగా బియ్యము కానీ బియ్యపు పిండిగానీ పరచవలెను. ఉపనయనము అయిన నాటి నుడీ ఆ ఉపనయనాగ్నిలోనే సాయంత్రము మొదలుపెట్టి , ఉదయమూ , సాయంత్రమూ అగ్నికార్యము చేయవలెను. అది కుదరని యెడల , లౌకికాగ్ని లోనే చేయవలెను. హోమములు , యజ్ఞములు చేయునపుడు , అగ్నిని ప్రార్థించి , హోమానికి రక్షగా మంత్రములతో అభిమంత్రించిన నీటిని , బ్రహ్మను నియమించి , యజ్ఞాయుధములను ( అనగా షట్పాత్రలు లేదా చతుష్పాత్రలు ) మరియు ఆజ్యమును , చరువును సంస్కరించి , అగ్నికి పరిస్తరణములు , పరి సమూహనము , అలంకారము , పూజ మొదలగునవి చేయు కర్మను " అగ్ని ముఖము " అందురు. అందులో నెయ్యి అవసరమగును.


అగ్ని కార్యము చేయుటకు షట్పాత్ర , చతుష్పాత్ర ప్రయోగము లేదు. పూర్తి స్థాయిలో అగ్నిముఖము చేయకపోయినా , కొన్ని క్రమములను పాటించవలెను. విధానములో వాటిని చూడ వచ్చును.


స్నానముతో శుచుడై , మడి బట్టలు కట్టుకొని , సంధ్యావందనము చేసి , ఆ తరువాత తూర్పుకు తిరిగి హోమకుండము ముందర ఆసనముపై కూర్చొనవలెను. స్నాన సంధ్యలు చేయకుండా ఎన్నటికినీ అగ్నికార్యము చేయరాదు. చేసిననూ నిష్ఫలమగును. యే అనుష్ఠానము చేసిననూ , మొదట విధిగా రెండు సార్లు ఆచమనము చేయవలెను. ఒక్క సారి మాత్రమే చేయరాదు. ఆచమనము , ప్రాణాయామము చేసి ఈ విధముగా సంకల్పము చెప్పవలెను ,


విధానము :
మమోఽపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య , శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం , ప్రాతరగ్ని ( సాయంకాలమైతే సాయమగ్ని అని ) హోమ కార్యం కరిష్యే | ( లేదా సమిధమాధాస్యే ) ( కుడి చేతితో నీళ్ళు ముట్టుకొన వలెను )


కుండములో కట్టెలు , ఎండిన పిడకలు మొదలైనవి వేసి అగ్నిని ప్రజ్వలింపజేయవలెను. ప్రజ్వలింపజేయునపుడు ఈ మంత్రమును చెప్పవలెను


|| ఉపావరోహ జాతవేదః పునస్త్వమ్ | దేవేభ్యో హవ్యం వహనః ప్రజానన్ |
ఆయుః ప్రజాగ్ం రయిమస్మాసు ధేహి | అజస్రో దీదిహినో దురోణే ||


భూర్భువస్సువరోం | అగ్నిమ్ ప్రతిష్టాపయామి.


ఇప్పుడు ఒక సమిధను తీసుకొని, జ్వలిస్తున్న యజ్ఞేశ్వరుడికి ఆహుతి వేసి ఈ కింది మంత్రమును చెప్పవలెను.


|| ఓం స్వాహా జుషస్వనః సమిధమగ్నే అద్యశోచా బృహద్యజతం ధూమమృణ్వన్ |
ఉపస్పృశ దివ్యగ్ం సానస్తూపైః సగ్ం రశ్మిభిస్తతనః సూర్యస్య ||


అగ్నిని ప్రజ్వలించిన తరువాత ఈ మంత్రాన్ని చెప్పవలెను


|| పరిత్వాగ్నే పరిమృజామ్యాయుషా చ ధనేన చ | సుప్రజాః ప్రజయా భూయాసగ్ం సువీరో వీరైస్సువర్చా వర్చసా సుపోషః పోషైః స్సుగృహో గృహైస్సుపతిః పత్యా సుమేధా మేధయా సుబ్రహ్మా బ్రహ్మ చారిభిః ||


ఇప్పుడు అక్షతలు , పూలు తీసుకొని కుండమునకు ఎనిమిది మూలలందూ కొద్దిగా ఉంచుతూ అగ్నిదేవుడికి అలంకారము ,చేయవలెను. తూర్పు నుండీ మొదలు పెట్టి , ఆగ్నేయమూల మీదుగా ప్రదక్షిణముగా వదలుతూ ఈశాన్యము వరకూ ఎనిమిది దిక్కులలోనూ అక్షతలు వదలునపుడు వరుసగా ఈ ఎనిమిది మంత్రములను చెప్పవలెను


|| అగ్నయే నమః | హుతవహాయ నమః | హుతాశినే నమః | కృష్ణ వర్త్మనే నమః | దేవముఖాయ నమః | సప్తజిహ్వాయ నమః | వైశ్వానరాయ నమః | జాతవేదసే నమః ||


అటులే అగ్ని మధ్యలో కూడా వేసి ఈ మంత్రమును చెప్పవలెను


|| మధ్యే శ్రీ యజ్ఞపురుషాయ నమః ||


ఇప్పుడు కింది విధముగా అగ్ని పరిషేచనం చేయవలెను.


కుడిచేతితో కొద్దిగా నీరు తీసుకొని , హోమకుండమునకు బయట కుడి ప్రక్క , అనగా దక్షిణము న పడమటి నుండి తూర్పుకు ధారగా ఈ మంత్రముతో నేలపై నీరు వదలవలెను.


అదితేను మన్యస్వ |


తర్వాత మళ్ళీ నీరు తీసుకొని , కుండమునకు పశ్చిమమున , దక్షిణము నుండీ ఉత్తరమునకు ( దక్షిణపు నీటిని కలుపుకొని ) ధారగా ఈ మంత్రముతో నేలపై నీరు వదలవలెను.


అనుమతేను మన్యస్వ |


తర్వాత మళ్ళీ కుండమునకు ఎడమవైపున /ఉత్తరము వైపు , పడమటి నుండి తూర్పుకు ( పశ్చిమపు నీటిని కలుపుకొని) ధారగా ఈ మంత్రముతో నీరు వదలవలెను.


సరస్వతేను మన్యస్వ |


చివరిగా కుండమునకు తూర్పున , ఈశాన్యమునుండీ మొదలుపెట్టి కుండము చుట్టూ ప్రదక్షిణముగా మరలా ఈశాన్యమునే కలుపుతూ ధారగా ఈ మంత్రముతో నీరు వదలవలెను.


దేవసవితః ప్రసువ |


ఇప్పుడు మిగిలిన పదిహేడు సమిధలను తీసుకొని , ఒక్కొక్క దానినీ కింది పదిహేడు మంత్రములతో
( ఒక మంత్రమునకు ఒక సమిధ ) స్వాహాకారము చెప్పి క్రమముగా సమిదాధానము ( ఆహుతి ) చేయవలెను.


౧. || అగ్నయే సమిధమాహార్షం బృహతే జాతవేదసే యథా త్వమగ్నే సమిధా సమిధ్య స ఏవం మామాయుషా వర్చసా సన్యా మేధయా ప్రజయా పశుభిర్బ్రహ్మ వర్చసేనాన్నాద్యేన సమేధయ స్వాహా ||


౨. ఏధోఽస్యేధిషీమహి స్వాహా ||


౩. సమిదసి సమేధిషీమహి స్వాహా ||


౪. తేజోఽసి తేజో మయి ధేహి స్వాహా ||


౫. అపో అద్యాన్వచారిషగ్ం రసేన సమసృక్ష్మహి పయస్వాగ్ం అగ్న ఆగమం తం మా సగ్ంసృజ వర్చసా స్వాహా ||


౬. సం మాగ్నే వర్చసా సృజ ప్రజయా చ ధనేన చ స్వాహా ||


౭. విద్యున్మే అస్య దేవా ఇంద్రో విద్యాథ్సహ ఋషిభిస్వాహా ||


౮. అగ్నయే బృహతే నాకాయ స్వాహా ||


౯. ద్యావాపృథివీభ్యాగ్ స్వాహా ||


౧౦. ఏషా తే అగ్నే సమిత్తయా వర్ధస్వ చాప్యాయస్వ చ తయాహం వర్ధమానో భూయాసమాప్యాయమానశ్చ స్వాహా ||


౧౧. యో మాగ్నే భాగినగ్ం సంతమథాభాగం చికీర్షత్య భాగమగ్నే తం కురు మామగ్నే భాగినం కురు స్వాహా ||


౧౨. సమిధ మాధాయాగ్నే సర్వవ్రతో భూయాసగ్గ్ స్వాహా ||


౧౩. భూః స్వాహా || అగ్నయ ఇదమ్ నమమ


౧౪. భువః స్వాహా || వాయవ ఇదం నమమ


౧౫. సువః స్వాహా || సూర్యాయేదం నమమ


౧౬. భూర్భువస్సువస్స్వాహా || ప్రజాపతయ ఇదం నమమ


౧౭. స్వాహా జుషస్వనః |


సమిధలు సరిపడా లేని పక్షములో కనీసము చివరి అయిదు ఆహుతులనైనా వేయవలెను. ( భూః స్వాహా నుండీ స్వాహా జుషస్వనః వరకూ )


ఇప్పుడు మరలా వెనుకటి వలెనే , ఈ కింది మంత్రములతో అగ్ని పరిషేచనము చేయవలెను.


కుడిచేతితో కొద్దిగా నీరు తీసుకొని , హోమకుండమునకు బయట కుడి ప్రక్క , అనగా దక్షిణము న పడమటి నుండి తూర్పుకు ధారగా ఈ మంత్రముతో నేలపై నీరు వదలవలెను.


అదితేఽన్వ మగ్గ్‌స్థాః |


తర్వాత మళ్ళీ నీరు తీసుకొని , కుండమునకు పశ్చిమమున , దక్షిణము నుండీ ఉత్తరమునకు ( దక్షిణపు నీటిని కలుపుకొని ) ధారగా ఈ మంత్రముతో నేలపై నీరు వదలవలెను.


అనుమతేఽన్వ మగ్గ్‌స్థాః |


తర్వాత మళ్ళీ కుండమునకు ఎడమవైపున /ఉత్తరము వైపు , పడమటి నుండి తూర్పుకు ( పశ్చిమపు నీటిని కలుపుకొని) ధారగా ఈ మంత్రముతో నీరు వదలవలెను.


సరస్వతేఽన్వ మగ్గ్‌స్థాః |


చివరిగా కుండమునకు తూర్పున , ఈశాన్యమునుండీ మొదలుపెట్టి కుండము చుట్టూ ప్రదక్షిణముగా మరలా ఈశాన్యమునే కలుపుతూ ధారగా ఈ మంత్రముతో నీరు వదలవలెను.


దేవసవితః ప్రాసావీః |


తరువాత కింది మంత్రములు చెప్పుచూ అగ్న్యుపస్థానము చేయవలెను. అగ్ని ఉపస్థానము అనగా యజ్ఞేశ్వరుని ప్రార్థిస్తూ , బ్రహ్మచారి , తనను సర్వదా కాపాడమని , తనకు తేజస్సు , వర్చస్సు , మేధ , బుద్ధి , సంపదలు , బలము మొదలగునవి ఇవ్వమని వేడుకొనుట.


|| యత్తే అగ్నే తేజస్తేనాహం తేజస్వీ భూయాసమ్ | యత్తే అగ్నే వర్చస్తేనాహం వర్చస్వీ భూయాసమ్ | యత్తే అగ్నే హరస్తేనాహం హరస్వీ భూయాసమ్ ||


|| మయి మేధాం మయి ప్రజాం మయ్యగ్నిస్తేజో దధాతు | మయి మేధాం మయి ప్రజాం మయీంద్ర ఇంద్రియం దధాతు | మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో భ్రాజో దధాతు ||


ఈ కింది మంత్రమును చెప్పుచూ హోమ కుండపు తూర్పు వైపు నుండీ గానీ ఉత్తరము నుండీ గానీ ఒక సమిధతో భస్మమును సంగ్రహించవలెను.


|| మానస్తోకే తనయే మాన ఆయుషి మా నో గోషు మా నో అశ్వేషు రీరిషః | వీరాన్మానో రుద్రభామితో వధీర్‌హవిష్మంతో నమసా విధేమ తే ||


తరువాత , ఆ భస్మమును ఈ మంత్రములు చెప్పుచూ శరీరములోని ఆయా భాగములలో ఉంచుకొనవలెను.


మేధావీ భూయాసమ్ | ( లలాటమున భస్మమును పూసుకొన వలెను )


తేజస్వీ భూయాసమ్ | ( హృదయమున )


వర్చస్వీ భూయాసమ్ | ( కుడి భుజము )


బ్రహ్మ వర్చస్వీ భూయాసమ్ | ( ఎడమ భుజము )


ఆయుష్మాన్ భూయాసమ్ | ( కంఠము )


అన్నదో భూయాసమ్ | ( జఠరము అనగా నాభి పైభాగము )


యశస్వీ భూయాసమ్ | ( శిరస్సు )


సర్వ సమృద్ధో భూయాసమ్ | ( శిరస్సు )


తర్వాత ఈ మంత్రములను చెప్పవలెను


|| పునస్త్వాదిత్యా రుద్రా వసవస్సమింధతాం పునర్బ్రహ్మాణో వసునీథయజ్ఞైః | ఘృతేనత్వం తనువో వర్ధయస్వ సత్యాస్సంతు యజమానస్య కామా స్వాహా ||


యజ్ఞేశ్వరుడికి ప్రదక్షిణము చేసి మరలా తన స్థానములో నిలుచుకొని నమస్కరిస్తూ ఇది చెప్పవలెను.


||మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశన | యద్ధుతంతు మయా దేవ పరిపూర్ణం తదస్తు మే ||


|| స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం | ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే హవ్యవాహన | శ్రియం దేహి మే హవ్యవాహన | ఓమ్ నమః ||


అభివాదనమ్


( ఇక్కడ ప్రవర చెప్పుకోవలెను )


|| చతుస్సాగర పర్యంతం .........అహంభో అభివాదయే ||


|| హోమాంతే శ్రీ యజ్ఞపురుషాయ నమః || ధ్యానాది షోడశోపచారాన్ సమర్పయామి ||


అనేన ప్రాతః ( సాయం ) సమిదాధాన హోమేన భగవాన్ శ్రీ యజ్ఞేశ్వరః ప్రీయతామ్ ||


భగవదర్పణమ్


|| కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేస్స్వభావాత్ |
కరోమి యద్యద్సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి ||

|| శుభం భూయాత్ ||

No comments:

Post a Comment