పసిపిల్లల కిడ్నీలకు ఆపద!
ఏడాది వయసు నుంచే బయటపడుతున్న ఇన్ఫెక్షన్లు
నాటుమందులు వాడటం ద్వారా తీవ్ర ముప్పు
పెరిటోనియల్ డయాలసిస్ ద్వారా కేజీహెచ్‌లో ప్రాణదానం
ఈనాడు - విశాఖపట్నం
పెద్దల్లోనే కాదు.. పసిపిల్లల్లోనూ మూత్రపిండాల సమస్య తీవ్రమవుతోంది. మూత్రపిండాల సమస్యలతో కేజీహెచ్‌కు వచ్చిన పిల్లలకు తగు పరీక్షలు చేసినప్పుడు.. 49శాతం కేసులు వివిధరకాల ఇన్ఫెక్షన్లతో వచ్చినవేనని నిర్ధరణ అవుతోంది. వీటిలో మలేరియా, బ్యాక్టీరియా సమస్యలతో ఇన్ఫెక్షన్ అయి కిడ్నీకి ఇబ్బంది తెచ్చుకున్నవారే 82శాతం మంది ఉన్నారు. ఎక్కువగా ఏడాది పిల్లలకు నాటుమందు తాగించే సంస్కృతి ఇంకా కొనసాగుతోందని, ఇలా చేయడం వల్ల ప్రమాదకర టాక్సిన్‌లు కిడ్నీలోకి వెళ్లి పాడుచేస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. మూత్రనాళం, మూత్రాశయంలో వస్తున్న జన్యుపరమైన సమస్యల ద్వారానూ కిడ్నీ సమస్యలొస్తాయని పేర్కొంటున్నారు.
పెరిటోనియల్ డయాలసిస్ ద్వారా..
మూత్రపిండాల సమస్యలకు సహజంగా హీమోడయాలసిస్ చేస్తారు. అయితే ఇది పెద్దలకు మాత్రమే. 0-18ఏళ్ల పిల్లల్లో కిడ్నీలు పాడవుతున్నాయని గుర్తించినప్పుడు వారికోసం ప్రత్యేకంగా పెరిటోనియల్ డయాలసిస్ (పీడీ) చేయాల్సి ఉంటుంది. పిల్లల పొట్టకు చిన్న రంధ్రం చేసి పైపు ద్వారా ద్రవరూపంలో ఉన్న మందుల్ని కిడ్నీకి చేరేలా చేస్తారు. కిడ్నీలోపల ఉన్న టాక్సిన్‌లను మార్పు చెందించి తిరిగి ఆ ద్రావణాన్ని బయటికి తీస్తారు. ఒక్కో డయాలసిస్ గంట పాటూ చేయాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రత ఎక్కువుగా ఉండే పిల్లలకు రోజుకు 20సార్లు కూడా డయాలసిస్ చేస్తున్నారు.
గుర్తించకపోతే మరణమే..
పిల్లలు శబ్దాలు చేయకపోవడం, రంగు మారడం, కళ్లు వాపుగా ఉండటం, వాంతులు, విరేచనాలు ఎక్కువగా ఉండటం, కడుపునొప్పి, అతిమూత్రం, తక్కువ మూత్ర విసర్జన సమస్యలున్నవారిలో సహజంగా ఇలాంటివి బయటపడుతుంటాయని వైద్యులు చెబుతున్నారు. ‘ఎంత త్వరగా మూత్రపిండాల సమస్యల్ని గుర్తిస్తే పిల్లల ప్రాణాలకు అంత భరోసా ఇవ్వొచ్చు. ఇలా కేజీహెచ్‌లో ఏటా కనీసం 200-300 కేసుల్లో ముందే గుర్తించి చికిత్స ఇవ్వడం జరుగుతోంది. ముందుగా గుర్తించకుంటే వ్యాధి ముదిరిపోయి అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ (ఏకేఐ) దారితీసి మరణం కూడా సంభవించవచ్చు. కిడ్నీ పాడవటం వల్ల అది కాలేయం, గుండె, ఊపిరితిత్తులకూ చేటు తెస్తుందని’ వైద్యులు హెచ్చరిస్తున్నారు.
75శాతం మందికి అభయం
పిల్లల కోసం కేజీహెచ్‌లో ప్రత్యేకించి పెరిటోనియల్ డయాలసిస్ చేస్తున్నారు. సుమారు 75శాతం మంది పిల్లలు సమస్యనుంచి 100శాతం బయటపడినట్లు నెఫ్రాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ గుల్లిపల్లి ప్రసాద్ తెలిపారు. మరో 19.30శాతం మంది పాక్షికంగా బయటపడగా.. 5.6శాతం మంది మృతిచెందారని వెల్లడించారు. విశాఖ జిల్లాతో పాటు కోస్తాంధ్ర చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఏటా 350నుంచి 450మంది పసిపిల్లలు కిడ్నీ సమస్యలతో విశాఖలోని కేజీహెచ్‌కు వస్తున్నారని.. వీరిందరి మీదా ఇక్కడి నెఫ్రాలజీ విభాగం ప్రత్యేక పరిశీలనలు చేసిందన్నారు.
No comments:
Post a Comment