Monday, July 2, 2018

అమ్మా..అవిఘ్నమస్తు!| గర్భిణుల తగు జాగ్రత్తలు | Pregnancy Care | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu


అమ్మా..అవిఘ్నమస్తు!| గర్భిణుల తగు జాగ్రత్తలు | Pregnancy Care | Pregnancy Mother | Pregnant Women | Pregnant Lady | Labor Pain | Labor | High BP | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu | Bhakthi Pustakalu | Bhaktipustakalu | Bhakti Pustakalu | BhakthiBooks | MohanBooks | Bhakthi | Bhakti






అమ్మా..అవిఘ్నమస్తు!

    మహిళ జీవితంలో గర్భధారణ అపూర్వమైన అధ్యాయం! తన ప్రతిరూపాన్ని తనకు తానే బహూకరించుకునే అద్భుతమైన సందర్భం!! అలాంటి ఆనంద ఘడియలకు ఎలాంటి విఘ్నం తలెత్తినా మనసు కలుక్కుమంటుంది. ముఖ్యంగా ముందు నుంచే ఏవైనా సమస్యలుంటే.. అదీ గర్భంపై దుష్ప్రభావాలు చూపేవైతే ఎన్నెన్నో ఆందోళనలు, భయాలు ముసురుకుంటాయి. మూర్ఛ, ఆస్థమా, మధుమేహం, అధిక రక్తపోటు ఇలాంటి సమస్యలే. ఒకప్పుడు వీటితో బాధపడే మహిళలను గర్భమే ధరించొద్దని చెప్పేవారు. కానీ అధునాతన వైద్య సదుపాయాలు, చికిత్సలు అందుబాటులోకి రావటంతో ఇప్పుడు ఎంతోమంది హాయిగా గర్భం ధరిస్తున్నారు. పండంటి సంతానాన్ని కంటున్నారు. అంతమాత్రాన గుండె మీద చేయి వేసుకొని నిబ్బరంగా ఉండాల్సిన పనిలేదు. ఇలాంటి సమస్యలు ఎప్పుడెలా దాడిచేస్తాయో, ఎలాంటి అనర్థాలు తెచ్చిపెడతాయో తెలియదు. కాబట్టి వీటిపై అవగాహన కలిగుండటం, తగు జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ఇందులో వైద్యుల దగ్గర్నుంచి గర్భిణుల వరకూ అందరిదీ కీలకపాత్రే. 



   గర్భధారణ అతి సున్నితమైన, సంక్లిష్టమైన ప్రక్రియ. పైకి అంతా మామూలుగా.. సహజాతి సహజంగా జరుగుతున్నట్టు కనిపిస్తుంటుంది గానీ కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడు తల్లి శరీరంలో ఎన్నో జీవక్రియల మార్పులు జరుగుతుంటాయి. ఇవన్నీ తల్లి శరీరాన్ని తీవ్ర ఒత్తిడిలోకి నెడతాయి. దీనికి తోడు అప్పటికే దీర్ఘకాలిక జబ్బులేవైనా ఉంటే అవి గర్భం ధరించాక తీవ్రం కావొచ్చు. ఇవి తల్లీ బిడ్డపై దుష్ప్రభావాలు చూపొచ్చు. ఒకప్పుడు గర్భిణుల మీద ఇంత ఒత్తిడి ఉండేది కాదు. ప్రస్తుతం మహిళల జీవనశైలి, ఆహార అలవాట్ల వంటివి బాగా మారిపోయాయి. చదువులు, ఉద్యోగాల మూలంగా ఇప్పుడు ఎంతోమంది ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. పిల్లలను కనటాన్నీ వాయిదా వేసుకుంటున్నారు. ఈ క్రమంలో వయసుతో పాటు ముంచుకొచ్చే మధుమేహం, అధిక రక్తపోటు వంటి జబ్బుల ముప్పూ పెరుగుతోంది. కొందరికి మూర్ఛ, ఆస్థమా వంటివీ ఉంటుండొచ్చు. ఇలాంటి సమస్యలు గర్భధారణ దగ్గర్నుంచి కాన్పు వరకూ రకరకాల చిక్కులు తెచ్చిపెడతాయి. తల్లీ బిడ్డల జీవితాలపై ప్రభావం చూపే అవకాశం ఉండటం వల్ల గర్భాన్ని కొనసాగించుకోవచ్చా? కాన్పు సమయంలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? పుట్టిన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది? అనే సందేహాలు మనసును తొలుస్తుంటాయి. గతంలో వీటి విషయంలో వైద్యులు కూడా భయపడిపోతుండేవారు. కానీ కొత్త చికిత్సలు, మందుల రాకతో అలాంటి భయాలన్నీ పటాపంచలైపోయాయి. ఏవైనా సమస్యలున్నా కూడా వాటిని అదుపులో పెడుతూ.. హాయిగా కాన్పయ్యేలా చూడటానికి మార్గం వేస్తున్నాయి.


హైబీపీని అశ్రద్ధ చేయొద్దు 

అధిక రక్తపోటు (హైబీపీ) తల్లీబిడ్డలిద్దరికీ హాని తలపెడుతుంది. కొందరికి ముందు నుంచే అధిక రక్తపోటు ఉండొచ్చు. కొందరికి గర్భధారణ సమయంలో హైబీపీ రావొచ్చు. గర్భధారణకు 20 వారాల ముందు నుంచీ.. అలాగే కాన్పు తర్వాత 12 వారాల వరకూ ఉండే హైబీపీని ‘క్రానిక్‌’ సమస్యగానూ.. గర్భం ధరించిన 20 వారాల తర్వాత హైబీపీ మొదలైతే ‘గర్భిణి హైబీపీ’గానూ పరిగణిస్తారు. 

దుష్ప్రభావాల దాడి 
హైబీపీ పెరుగుతున్నకొద్దీ రక్తనాళాలు సంకోచించి.. మాయకు రక్త ప్రసరణ తగ్గుతుంది. దీంతో గర్భస్థ శిశువుకు ఆక్సిజన్‌, పోషకాలు సరిగా అందక ఎదుగుదల దెబ్బతింటుంది. బిడ్డ తక్కువ బరువుతో పుట్టొచ్చు. కొన్నిసార్లు గర్భసంచి నుంచి మాయ ముందుగానే విడిపోయి.. పెద్దమొత్తంలో రక్తస్రావం జరగొచ్చు. నెలలు నిండకముందే కాన్పు కావొచ్చు. అందుకే హైబీపీ గర్భిణులకు కొన్నిసార్లు ముందుగానే సిజేరియన్‌ చేయాల్సిన పరిస్థితీ తలెత్తుతుంది. బీపీ ఎక్కువెక్కువగా పెరిగిపోతున్నకొద్దీ గర్భవాతానికి (ప్రిఎక్లాంప్సియా) దారితీయొచ్చు. మూత్రంలో సుద్ద పోవటం మొదలవుతుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే పెద్ద ప్రాణానికే ముప్పు తలెత్తొచ్చు. అంతేకాదు.. మున్ముందు తల్లికి గుండె పెద్దదవటం, కాలేయం విఫలం కావటం వంటి ముప్పులూ పెరగొచ్చు. కాబట్టి గర్భవాత సంకేతాలపై ఓ కన్నేసి ఉండటం మంచిది. విడవకుండా తలనొప్పి, కళ్లు మిరుమిట్లు గొలపటం, చూపు మసకబారటం, కడుపులో ముఖ్యంగా కుడివైపు నొప్పి వస్తుండటం. హఠాత్తుగా బరువు పెరగటం.. ముఖం, చేతులు ఉబ్బరించటం వంటివి కనబడితే ఏమాత్రం తాత్సారం చేయరాదు. ముందు నుంచే హైబీపీ గలవారికి, ఎక్కువ మంది సంతానం గలవారికి, గతంలో గర్భవాతం బారినపడ్డవారికి, ఊబకాయులకు, 20 ఏళ్ల కన్నా తక్కువ 40 ఏళ్ల కన్నా ఎక్కువ వయసు గలవారికి, మధుమేహం వంటి ఇతరత్రా సమస్యలు గలవారికి ప్రిఎక్లాంప్సియా ముప్పు ఎక్కువ. వీరికి అవసరమైతే బీపీ మందులతో పాటు తక్కువ మోతాదు ఆస్ప్రిన్‌ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు 
* అప్పటికే హైబీపీ ఉన్నవాళ్లు గర్భధారణకు ప్రయత్నించటానికి ముందే డాక్టర్‌ సలహా తీసుకోవటం మేలు. అలాగే గర్భం ధరించిన తర్వాత క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రతించాలి. 
* బీపీ మందులను మధ్యలో మానెయ్యరాదు. 
* ఆహారంలో ఉప్పు తగ్గించాలి. 
* బరువు అదుపులో ఉంచుకోవాలి. 
* యోగా, ధ్యానం మేలు చేస్తాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తూ గర్భవాతానికి దారితీయకుండా చూస్తాయి.


మధుమేహాన్ని మరవొద్దు

మధుమేహం తల్లికే కాదు.. శిశువుకూ చిక్కులు తెచ్చిపెట్టొచ్చు. గర్భంలో శిశువు ఎదుగుతున్నకొద్దీ తల్లి శరీరమూ పెరుగుతుంది. ఇది గ్లూకోజు స్థాయులనూ ప్రభావితం చేస్తుంది. వీరిలో గ్లూకోజు స్థాయులు తగ్గటం వల్ల తలెత్తే లక్షణాలను గుర్తించటమూ కష్టమే. అందువల్ల గర్భధారణ సమయంలో మధుమేహాన్ని నియంత్రించటమనేది నిజంగా సవాలే. దీనికి గైనకాలజిస్టులతో పాటు పలువురు నిపుణులు బృందంగా పనిచేయాల్సి ఉంటుంది. 

తొలి 7 వారాల్లోపే గర్భస్థ శిశువు అవయవాలు రూపుదిద్దుకుంటాయి. కొందరికి అప్పటికి గర్భం ధరించిన విషయమే తెలియకపోవచ్చు. ఈ సమయంలో రక్తంలో గ్లూకోజు స్థాయులు చాలా ఎక్కువుంటే అవయవ లోపాలు తలెత్తొచ్చు. కాబట్టి మధుమేహ మహిళలు గర్భధారణకు ముందు నుంచే గ్లూకోజు స్థాయులు నియంత్రణలో ఉంచుకోవటం ఎంతో అవసరం. 

ఎన్నెన్నో ముప్పులు 
నిజానికి మధుమేహం స్వల్పంగా ఉంటే పెద్దగా ఇబ్బందులేవీ ఉండవు. గ్లూకోజు స్థాయులను జాగ్రత్తగా గమనిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. కానీ మధుమేహం నియంత్రణలో లేకపోతే చిక్కులు తప్పవు. రక్తంలో ప్రవహించే అదనపు గ్లూకోజు మాయను దాటుకొని శిశువుకు చేరుకుంటుంది. దీంతో శిశువు క్లోమం మరింత ఎక్కువగా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది శిశువు మరీ పెద్దగా పెరగటానికి దారితీస్తుంది. ఫలితంగా కాన్పు కష్టమై పిల్లల్లో భుజంలోని నాడులు దెబ్బతినొచ్చు. భుజం ఎముక విరిగిపోవచ్చు. తగినంత ఆక్సిజన్‌ అందకపోవటం వల్ల అరుదుగా కొందరు పిల్లల్లో మెదడు దెబ్బతినొచ్చు. కొందరికి నెలలు నిండకముందే కాన్పు కావొచ్చు, గర్భం నిలబడకపోవచ్చు. పిల్లలకు అవయవ లోపాలు, దీర్ఘకాలం కామెర్లు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది వంటి సమస్యలు తలెత్తొచ్చు. తల్లికి- కంటి సమస్యలు, కిడ్నీ సమస్యల వంటివీ తీవ్రం కావొచ్చు. మూత్రకోశంలో, జననాంగ భాగంలో ఇన్‌ఫెక్షన్లు రావొచ్చు. రక్తపోటు పెరిగిపోయి గర్భవాతానికి (ప్రిఎక్లాంప్సియా) దారితీయొచ్చు. గర్భధారణ సమయంలో తల్లి రక్తంలో గ్లూకోజు స్థాయులు ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంటే కాన్పు తర్వాత పిల్లల్లో హఠాత్తుగా గ్లూకోజు స్థాయులు మారిపోవచ్చు. అందువల్ల వీరికి అవసరమైతే బయటి నుంచి గ్లూకోజు ఇవ్వాల్సి వస్తుంది. అలాగే క్యాల్షియం, మెగ్నీషియం స్థాయులనూ కనిపెట్టుకోవాల్సి ఉంటుంది. మధుమేహ గర్భిణులకు చాలావరకు సహజంగా ప్రసవమయ్యేందుకే ప్రయత్నిస్తారు. అయితే బిడ్డ పెద్దగా ఉన్నప్పుడు, కాన్పు కష్టమయ్యే సూచనలు కనబడుతున్నప్పుడు సిజేరియన్‌ చేయాల్సి వస్తుంది. దీంతో తల్లికి, బిడ్డకు ముప్పులు తగ్గేలా చూసుకోవచ్చు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు 
* తరచుగా రక్తంలో గ్లూకోజు మోతాదులను పరీక్షించుకోవాలి. 
* తాజా పండ్లు, కూరగాయలు, పొట్టు తీయని ధాన్యాలు తీసుకోవాలి. 
* మధుమేహ మందులు, ఇన్సులిన్‌ వంటివి క్రమం తప్పకుండా తీసుకోవాలి. కొందరికి మాత్రలకు బదులు ఇన్సులిన్‌ వాడాల్సిన అవసరమూ ఉండొచ్చు. 
* పిల్లల్లో పుట్టుకతో లోపాలు తలెత్తకుండా ఫోలిక్‌ యాసిడ్‌ వంటి విటమిన్లు వాడుకోవాలి. 
* నిపుణుల సూచనల మేరకు వ్యాయామాలు చేయటం మంచిది. రోజుకు కనీసం అరగంట సేపు నడక, జాగింగ్‌, ఎక్సర్‌సైజ్‌ సైకిల్‌ తొక్కటం వంటివి చేయొచ్చు. 
* వేవిళ్ల మూలంగా కొందరికి తిండి సహించదు. ఇలాంటి సమయంలో తీసుకునే ఆహారాన్ని బట్టి ఇన్సులిన్‌ మోతాదులనూ మార్చాల్సి ఉంటుంది. 
* మాయ నుంచి విడుదలయ్యే హార్మోన్లు చివరి త్రైమాసికంలో ఇన్సులిన్‌ పనితీరును అడ్డుకోవచ్చు. అందువల్ల మరింత ఎక్కువ ఇన్సులిన్‌ తీసుకోవాల్సి రావొచ్చు. 
* గర్భధారణ సమయంలోనూ రోజువారీ ఆహారమే తీసుకున్నప్పటికీ గ్లూకోజు మోతాదును దృష్టిలో పెట్టుకొని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. 
* కాన్పు తర్వాత కూడా రక్తంలో గ్లూకోజు స్థాయులను నియంత్రణలో ఉంచుకోవటం మరవరాదు.


మూర్ఛకు బెదరొద్దు

ఒకప్పుడు మూర్ఛతో బాధపడే మహిళలకు పెళ్లి చేసుకోవద్దని చెబుతుండేవారు. అదంతా గతం. మూర్ఛతో బాధపడేవారిలో 90 శాతానికి పైగా మహిళలు ఇప్పుడు హాయిగా గర్భం ధరిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పండంటి సంతానాన్ని కంటున్నారు. గర్భిణుల్లో మూర్ఛ ఒకొకరిలో ఒకోలా ఉండొచ్చు. కొందరిలో ఫిట్స్‌ తరచుగా వస్తుంటే.. కొందరిలో తగ్గొచ్చు. మరికొందరిలో ఎప్పటిలాగానే వస్తుండొచ్చు.

గర్భధారణ నుంచే చిక్కులు 
మూర్ఛ బాధితుల్లో నెలసరి సరిగా కాకపోవటం, అండాశయాల్లో నీటి తిత్తులు ఏర్పడటం వంటివి ఎక్కువ. దీంతో గర్భధారణ కష్టమవుతుంటుంది. కొన్నిరకాల మూర్ఛ మందులు సైతం దీనికి ఆజ్యం పోస్తుంటాయి. ఇక గర్భం ధరించిన తర్వాత జననాంగం నుంచి రక్తస్రావం.. ముందుగానే మాయ విడిపోవటం.. అధిక రక్తపోటు.. మూత్రంలో సుద్ద (ప్రోటీన్‌) పోవటం.. నెలలు నిండకముందే కాన్పు కావటం.. నొప్పులు మొదలయ్యాక కాన్పుకు ఎక్కువ సమయం పట్టటం.. పిల్లలు తక్కువ బరువుతో, లోపాలతో పుట్టటం వంటి ముప్పులు పెరుగుతుంటాయి. మూర్ఛతో పాటు దీనికి వాడుకునే మందులూ పిండంపై విపరీత ప్రభావం చూపొచ్చు. గ్రహణం మొర్రి, నాడుల లోపాలు, గుండె లోపాల వంటి సమస్యలకు దారితీయొచ్చు. కొందరు పిల్లల్లో కళ్లు వెడల్పుగా ఉండటం, కింది పెదవి చిన్నగా ఉండటం వంటి చిన్న చిన్న లోపాలూ ఉండొచ్చు. ఒకటి కన్నా ఎక్కువ మూర్ఛ మందులు.. అదీ ఎక్కువ మోతాదులో తీసుకునేవారికి పుట్టే పిల్లల్లో ఇలాంటివి ఎక్కువ. అలాగని మందులు మానేస్తే మొదటికే మోసం వస్తుంది. మందులు వేసుకోకపోయినా, మూర్ఛ నియంత్రణలో లేకపోయినా పిండానికి తగినంత ఆక్సిజన్‌ అందదు. దీంతో సమస్యలు, ముప్పులు ఎక్కువయ్యే ప్రమాదముంది. గర్భస్రావం కావొచ్చు, బిడ్డ చనిపోయీ పుట్టొచ్చు. అందువల్ల మందులు మానెయ్యటం తగదు. నిజానికి కొందరికి గర్భధారణకు ముందు నుంచే మందులను తగ్గించుకుంటూ రావొచ్చు. గర్భంపై అంతగా దుష్ప్రభావం చూపని సురక్షితమైన మందులు ఇవ్వటం, అవసరమైతే మందుల మోతాదులను తగ్గించటం, వీలైనంతవరకు ఒకటి కన్నా ఎక్కువ మందులు ఇవ్వకుండా ఉండటం ద్వారా దుష్ప్రభావాలను తగ్గించుకునే అవకాశముంది. కొందరికి గర్భధారణ సమయంలో, కాన్పయిన వెంటనే రక్తంలో మూర్ఛ మందుల స్థాయులు తగ్గిపోతుండొచ్చు. దీంతో మూర్ఛ తరచుగా, తీవ్రంగా రావొచ్చు. కాబట్టి రక్తంలో మందుల స్థాయులను గమనిస్తూ.. అవసరాన్ని బట్టి మందుల మోతాదులను మార్చాల్సి ఉంటుంది కూడా. ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలను తీసుకోవటం ద్వారా పిల్లల్లో నాడీ లోపాలు తలెత్తకుండానూ చూసుకోవచ్చు. కాబట్టి గర్భధారణకు ప్రయత్నించటానికి ముందు నుంచీ.. అలాగే గర్భం ధరించిన తర్వాత న్యూరాలజిస్టులను, గైనకాలజిస్టులను సంప్రతించటం మంచిది. చాలామందికి ఎలాంటి సమస్యలు లేకుండానే కాన్పు జరుగుతుంది. ఎవరికైనా మూడో త్రైమాసికంలో తరచుగా మూర్ఛ వస్తున్నట్టయితే సిజేరియన్‌ చేయాల్సి రావొచ్చు. కాన్పయ్యేటప్పుడు మూర్ఛ వస్తే రక్తనాళాల ద్వారా ఇచ్చే మందులను ఆపేయాల్సి ఉంటుంది. మందులు వేసుకుంటున్నా కాన్పు తర్వాత బిడ్డకు తల్లిపాలు పట్టొచ్చు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు 
* డాక్టర్లు సూచించిన మోతాదులో కచ్చితంగా మందులు వేసుకోవాలి. 
* మూర్ఛ వచ్చినపుడు వెంటనే డాక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాలి. 
* ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకోవాలి. 
* ఫోలిక్‌ యాసిడ్‌ వంటి విటమిన్లు తప్పకుండా వాడుకోవాలి. 
* నిపుణుల సలహా మేరకు తగినంత వ్యాయామం చేయాలి. 
* ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. 
* తగినంత నిద్ర పోయేలా చూసుకోవాలి. 
* పొగ, మద్యం, మాదక ద్రవ్యాల వంటి వాటి జోలికి వెళ్లకూడదు.


ఆస్థమాకు అదరొద్దు

ఆస్థమా దీర్ఘకాలం వేధిస్తుంది. ఆయాసం, ఛాతీ బిగపట్టటం, పిల్లికూతలతో తెగ ఇబ్బంది పెడుతుంది. గర్భధారణ సమయంలో పొట్ట పెరగటం, బరువు పెరగటం వంటి వాటితో దీని లక్షణాలు మరింత ఎక్కువయ్యే అవకాశమూ ఉంది. ముఖ్యంగా 29-36 వారాల సమయంలో లక్షణాలు అధికంగా కనబడుతుంటాయి. చిత్రంగా కొందరికి గర్భం ధరించిన తర్వాత.. నెలలు నిండుతున్న కొద్దీ ఆస్థమా తగ్గుముఖం పడుతూ వస్తుంటుంది కూడా.

ఆదమరిస్తే అంతే.. 
కొందరు గర్భం ధరించిన తర్వాత ఆస్థమా మందులు వాడుకోవటం మంచిది కాదని భావిస్తుంటారు. ఇది పెద్ద అపోహ. ఆస్థమా మందులు చాలావరకు సురక్షితమైనవే. గర్భం ధరించిన తర్వాత వీటిని వాడుకోవటం మరింత అవసరం కూడా. ఇంకొందరైతే ఆస్థమా లక్షణాలు తీవ్రమైనప్పుడే మందులు తీసుకుంటుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఉన్నట్టుండి ఆస్థమా నియంత్రణలో లేకపోతే పలు సమస్యలకు దారితీయొచ్చు. శ్వాస సరిగా ఆడకపోవటం వల్ల గర్భస్థ శిశువుకు తగినంత ఆక్సిజన్‌ అందకపోవచ్చు. ఇది పిండం ఎదుగుదలను దెబ్బతీయొచ్చు. పిల్లలు తక్కువ బరువుతో పుట్టొచ్చు. ఇక తల్లికి జననాంగం నుంచి రక్తస్రావం కావటం, రక్తపోటు పెరగటం, మూత్రంలో సుద్ద పోవటం వంటివీ ఉండొచ్చు. కాన్పు కష్టం కావటం, ఫలితంగా సిజేరియన్‌ చేయాల్సిన పరిస్థితీ తలెత్తొచ్చు. కొందరికి నెలలు నిండకముందే కాన్పూ కావొచ్చు. సమస్య మరింత తీవ్రమైతే బిడ్డ ప్రాణాలకే ముప్పు కలగొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం అవసరం. గర్భం ధరించినప్పట్నుంచీ కాన్పయ్యే వరకూ క్రమం తప్పకుండా డాక్టర్లను సంప్రతించటం మంచిది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు 
* అనవసర భయాలు, ఆందోళనలు వద్దు. ఇవి ఆస్థమా ఉద్ధృతమయ్యేలా చేస్తాయి. కాబట్టి ఏవైనా అనుమానాలు, భయాలుంటే నివృత్తి చేసుకోవాలి. పని చేస్తున్నప్పుడు ఆస్థమా లక్షణాలు కనబడుతున్నా డాక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాలి. 
* తమకు తామే మందులు మానెయ్యటం లేదా మందుల మోతాదును తగ్గించుకోవటం తగదు. 
* ఆస్థమాను ప్రేరేపించే దుమ్ము ధూళి, పుప్పొడి, జంతువుల నూగు, పొగ వంటి వాటికి దూరంగా ఉండాలి. 
* గొంతులోకి ఆమ్లం ఎగదన్నుకొని రావటం (జీఈఆర్‌డీ) కూడా ఆస్థమా లక్షణాలను ఉద్ధృతం చేయొచ్చు. ఇలాంటి సమస్య ఉంటే నియంత్రణలో ఉంచుకోవాలి. పడుకున్నప్పుడు తలభాగం ఎత్తుగా ఉండేలా చూసుకోవటం, ఆహారం కొదికొద్దిగా తీసుకోవటం, భోజనం చేశాక కనీసం 3 గంటల తర్వాత పడుకోవటం, మసాలాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. 
* దగ్గు, ఛాతీ బిగపట్టటం, ఆయాసం, పిల్లికూతల వంటి ఆస్థమా లక్షణాలపై ఓ కన్నేసి ఉంచాలి. ఇవి ఉద్ధృతం కావొచ్చని అనిపిస్తున్నప్పుడే జాగ్రత్త పడాలి. తీవ్రం కాకుండా చూసుకోవాలి. 
* నొప్పులు వస్తున్నప్పుడు, కాన్పు సమయంలో ఆస్థమా లక్షణాలు ఉద్ధృతం కావటమనేది అరుదు. అయినా కూడా జాగ్రత్త అవసరం. కాన్పయ్యేటప్పుడూ మందులను తీసుకోవాల్సి ఉంటుంది.

No comments:

Post a Comment