నయా కార్.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 300 కి.మీ మైలేజ్..!
ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ.. కరెంటుతో మాత్రం పెట్టుకోకూడదు. మాడి మసైపోతారు! ఇన్నాళ్లూ పెరిగేది రూపాయి.. తగ్గేది పైసా అంటూ.. అదుపులేని ధరలతో విర్రవీగి.. వాహనదారులను మాడి మసి చేసిన పెట్రోలు, డీజిల్‌లకు.. ఇప్పుడు సరైనోడు తగిలాడు. ఫుల్లుగా ఛార్జి చేసి రోడ్డెక్కితే.. రయ్‌మని దూసుకెళ్లే ఆ కొత్త శక్తి.. విద్యుచ్ఛక్తి వాహనం. దేశంలోనే కాదు, ఆంధ్ర- తెలంగాణలోను ఎలక్ట్రిక్ వెహికల్స్ దుమ్మురేపుతున్నాయ్..
పక్కనున్న వ్యక్తి సిగరెట్ కాలుస్తుంటే.. కొరకొర చూస్తాం.. అసహనంతో ముక్కు మూసుకుంటాం. ఉఫ్..ఉఫ్‌మంటూ చేత్తో విసురుకుంటాం.. పొగ తాగే అలవాటు లేని వాళ్లను.. ఒక్క సిగరెట్టే ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అలాంటిది.. నిత్యం లక్ష సిగరెట్ల పొగ చుట్టుముడితే.. ఊపిరి పోయాల్సిన వాయువే ఆయువు తీస్తుంటే.. అవును.. హైదరాబాద్‌లో ఇరవై ఎనిమిది లక్షలు.. విజయవాడలో పది లక్షలు.. విశాఖపట్టణంలో ఏడు లక్షలు.. దేశవ్యాప్తంగా పాతిక కోట్లు.. అవన్నీ పేరుకే వాహనాలు.. కానీ, కోట్ల సిగరెట్లకు పెట్టు. ఆ లెక్కన... నగరజీవులు పీలుస్తున్న కాలుష్యం.. రోజుకు ఇరవై సిగరెట్లకు సమానం. ఢిల్లీలో అయితే 44 బీడీల దమ్ము కొట్టినంత ప్రమాదకరం. మురికి నీటినైనా ఫిల్టర్‌లో వడగట్టుకోవచ్చు.. పెట్రోలు కల్తీనీ కనిపెట్టవచ్చు.. ఆఖరికి రక్తాన్నీ శుద్ధి చేసుకోవచ్చు.. కానీ, గాలిని శుభ్రపరచలేం. కోట్లు ఖర్చుచేసినా స్వచ్ఛమైన శ్వాసను కొనలేం.. ఇప్పుడు - మన ప్రాణాలు గాలిలో దీపాలు.. ‘స్మోకింగ్ ఈజ్ ఇంజ్యూరియస్ టు హెల్త్’ సిగరెట్ పెట్టె మీద కాదు.. వాహనాల నెంబర్ ప్లేట్ల పైన రాయాల్సిన హెచ్చరిక.
ఎవరికైనా కోపమొస్తే బీపీ పెరుగుతుంది. ఆ మధ్యన ఒకపైసా పెట్రోలు ధర తగ్గించినందుకు.. దేశమంతా బీపీ పెరిగింది. షాంపూ షాచేల్లో పెట్రోలు, చుక్కల మందు సీసాల్లో డీజిలు పోసుకునే రోజుల్ని ఊహించుకుని నవ్వుకున్నారు. వాట్సాప్ జోకులతో ఆ కోపాన్ని చల్లార్చుకున్నారు. పెట్రోలు, డీజిల్ రేట్లు.. సెన్సెక్స్‌ను మించిపోయాయి. ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో ఊహించలేం. ముప్పయ్యేళ్ల కిందట ఎనిమిది రూపాయలున్న పెట్రోలు.. ఇప్పుడు ఎనభై రూపాయలు దాటింది. జనం డబ్బే కాదు.. దేశ సంపదంతా అరబ్బు దేశాలకు తరలిపోతోంది. గత ఏడాది మనం దిగుమతి చేసుకున్న క్రూడ్ ఆయిల్ విలువ.. అక్షరాలా ఐదు లక్షల కోట్ల రూపాయలు. ఈ మొత్తం - ఓ ఐదు రాష్ట్రాల బడ్జెట్ విలువంత!.
ఒక వైపు పొగ.. మరోవైపు దగా..
కాలుష్యానికి హ్యాండ్‌బ్రేక్ వేయాలి. ఇంధనభారం తగ్గించుకోవాలి. లేకపోతే మనుగడ లేదు. రవాణా రాంగ్‌రూట్‌లో వెళుతోంది. పొగలు కమ్మే కాలుష్యం.. యాక్సిడెంట్లకంటే ఘోరంగా చంపుతోంది. ఆటోమొబైల్ కంపెనీలన్నీ రాత్రింబవళ్లు శ్రమించాయి. పరిశోధన-అభివృద్ధి సంస్థలు శోధించాయి. ఆఖరికి - ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. అన్నట్లు ప్రపంచానికి ఓ కొత్త అస్త్రం దొరికింది. ఆ అద్భుతం ‘ఎలక్ట్రిక్ వెహికల్’ (ఈవీ). మసితో మాసిపోతున్న తరానికి.. బల్బులు బద్దలయ్యే ఐడియా!
చైనాదే హవా..
ఒకప్పుడు కరెంటుకు కటకటలాడేవాళ్లం. పాలకులు కూడా కోతల నుంచి చేతల్లోకి వచ్చేశారు. ఇరవై నాలుగ్గంటల విద్యుత్ సరఫరా ఆశాజనకంగానే ఉంది. ఇప్పటికీ విద్యుత్ లేని పల్లెలు ఉన్నప్పటికీ.. సంపూర్ణ వెలుగులకు భారత్ ఎంతో దూరంలో లేదు. విద్యుచ్చక్తి ఉత్పత్తి కంపెనీల సంఖ్య పెరుగుతోంది. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలతో పోల్చితే, విద్యుత్ ఛార్జీలు అదుపులోనే ఉన్నాయి. రవాణాకు కరెంటుకంటే మంచి ఇంధనం లేదన్నది శాస్త్రవేత్తల ఆలోచన. ఖర్చు తక్కువ. కాలుష్యం లేదు.
ఎలక్ట్రిక్ కారును ఎప్పుడో కనిపెట్టినా.. రోడ్ల మీదికి తీసుకొచ్చేందుకు నూట ఎనభై ఏళ్లు పట్టింది. తొలి ఎలక్ట్రిక్ కారును 1837లోనే తయారుచేశారు. అప్పట్లో విద్యుత్ కొరత ఉండేది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతుండటంతో.. విద్యుత్‌వైపు మొగ్గు చూపాల్సిన సమయం వచ్చేసింది. దీనికితోడు ప్రపంచ నగరాలన్నీ కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. కర్బన ఉద్గారాలను వెదజల్లని (జీరో ఎమిసన్) ఇంధనం తప్పనిసరైంది. అన్ని దేశాలూ కరెంటు కార్ల వైపు మొగ్గు చూపడానికి ఇదే కారణం. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనా ప్రకారం రెండేళ్ల కిందట 75 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడుపోయాయి. నార్వేలో అయితే 29 శాతం కరెంట్ కార్లే నడుస్తున్నాయిప్పుడు. నెదర్లాండ్, స్వీడన్, ఫ్రాన్స్, అమెరికా.. టాపగేర్‌లో వెళుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల్లో చైనా గ్లోబల్ లీడర్. ప్రపంచంలోని ఎలక్ట్రిక్ వాహనాల్లో 40 శాతం ఆ దేశంలోనే ఉన్నాయి. అతి పెద్ద కార్ల బ్యాటరీ ఉత్పత్తి సంస్థను నెలకొల్పేందుకూ చైనా సన్నాహాలు చేస్తోంది. ఇదే కనక విజయవంతం అయితే మొబైల్ విప్లవం తరువాత మరో కొత్త విప్లవానికి ఆ దేశం నాంది పలకనుంది. కరెంటు కార్ల విక్రయాల్లోనే ఆ పొరుగుదేశం హవా ఎంతగా ఉండ బోతోందంటే.. ‘ఈ రంగంలో వచ్చే ఏడేళ్లలో సగం వాటా దానిదే!’ అంటూ బ్లూమ్‌బర్గ్ ఎలక్ట్రిక్ వాహనాల నివేదిక స్పష్టం చేసింది.
ప్రయాణం.. పర్యావరణహితం కావాలి.. జీవం మనుగడకు ప్రాణవాయువును అందించే ప్రకృతికే పొగబెడితే..చేరాల్సిన గమ్యం.. అగమ్యగోచరం అవుతుంది. ‘సేఫ్‌జర్నీ’ కార్ల వెనక అద్దాల మీద రాసుకునే ఒట్టి ముచ్చట అవుతుంది.. ‘మీ స్టీరింగ్‌ను గ్రీన్‌జర్నీ వైపు తిప్పండి. లేకపోతే పొగకమ్మిన నగరాల ఉనికికే ప్రమాదం’ అంటున్న టెస్లా కార్ల ఉత్పత్తి సంస్థ యజమాని ఎలక్ట్రిక్ కార్ల ప్రాధాన్యాన్ని గట్టిగా చెబుతున్నారు. కనీసం సగం వాహనాలైనా కరెంటుతో నడిస్తే.. ‘ఈ నగరానికి ఏమైంది’ అని నిందించాల్సిన అవసరమే రాదు.
విద్యుత్ భారత్..
నువ్వు ముందా? నేను ముందా?
ఫార్ములావన్ రేసులా దూసుకెళుతోంది పోటీ ప్రపంచం. భవిష్యత్తును ముందే ఊహించి.. అవకాశాలను అందిపు చ్చుకున్నప్పుడే.. పోటీలో నిలబడతాం. ఐటీ రంగాన్ని తొలిదశలో చేజిక్కించుకున్న దేశాలే ఇప్పుడు ముందున్నాయి. ఎలక్ట్రిక్ వాహన రంగమూ అలాంటిదే! పలు దేశాలు ఆ పాలసీలనే చేస్తున్నాయి. భారమవుతున్న ముడి చమురు వ్యయాలను తగ్గించుకోవడం.. కాలుష్యం నుంచి బయటపడటం.. ఇవి రెండూ ఒకరి సమస్య కాదు. ప్రపంచ సమస్య. భారత్ కూడా అటువైపు అడుగులు వేయక తప్పడం లేదు. నీతి అయోగ్ ఒక డ్రాఫ్ట్ పాలసీని రూపొందించింది. 2030 నాటికి అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలన్నది కేంద్రప్రభుత్వ ఆలోచనగా పేర్కొంది. ఆ కల నెరవేరితే.. అరవై నాలుగు శాతం ఇంధన భారం, ముప్పయి ఏడు శాతం కర్బన ఉద్గారాలు తగ్గించుకున్న వాళ్లం అవుతాం. వాహన కొనుగోలుదారులకు కొన్ని ఊరించే ఆఫర్లను కూడా ఇచ్చేందుకు పూనుకుంది ప్రభుత్వం.
మన దేశంలో బ్యాటరీకార్ల ప్రవేశానికి ఎదురవుతున్న తొలి సమస్య- సరైన రీ ఛార్జి సదుపాయం లేకపోవడం. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని బట్టి.. ఒక ఎలక్ట్రిక్ కారుకు ఒకసారి ఛార్జి చేసుకుంటే సుమారు 150 నుంచి 200 కిలోమీటర్లు వెళ్లొచ్చు. మధ్యలో చార్జి అయిపోతే ఎక్కడపడితే అక్కడ పెట్రోలు బంకులున్నట్లు ఛార్జింగ్ సెంటర్లు లేవు. ఇప్పటికైతే దేశవ్యాప్తంగా కేవలం 353 చార్జింగ్ స్టేషన్లు ఉన్నట్లు గ్రాండ్ త్రోంటన్ నివేదిక చెబుతోంది. అందుకే ప్రభుత్వం ఒక ప్రతిపాదన రూపొందించింది. నగరాల్లో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒకటి.. జాతీయరహదారుల్లో ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయబోతోంది. మరో మూడేళ్లలోపు ముప్పయి నుంచి నలభై వేల స్టేషన్లు వస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్‌టిపిసి, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ వంటి సంస్థల సహకారం తీసుకోనున్నారు. విద్యుత్‌కార్ల జాతీయ విధానాన్ని తొలుత అందిపుచ్చుకున్న రాష్ట్రం కర్ణాటక. ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్స్) పాలసీ చేసిన రాష్ట్రం కూడా అదే. బెంగళూరులో అత్యంత వేగవంతమైన తొలి చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి దేశాన్ని ఆకర్షించింది.
ఈ రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు రీసెర్చ్ అండ్ ఇన్నొవేషన్ హబ్‌తోపాటు ఇన్‌క్యుబేషన్ సెంటర్‌ను కూడా ప్రారంభించింది. భారతప్రభుత్వం పదివేల విద్యుత్ వాహనాలకు ఆర్డర్ ఇచ్చింది. మొదటి దశలో ప్రభుత్వ కార్యాలయాలన్నిట్లోనూ ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలన్నది ఆలోచన. టాటా మోటర్స్, మహీంద్రా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాయి. గత ఏడాది దేశ వ్యాప్తంగా సుమారు రెండు వేల కరెంటు కార్లు అమ్ముడుపోవడం రేపటి డిమాండుకు సూచిక. మహీంద్రా ఎప్పటి నుంచో ఈ కార్లను అమ్ముతోంది. ఈ మధ్యనే విడుదలైన అథేర్ స్కూటర్ వాహనదారులను ఆకట్టుకుంది. ఏడు అంగుళాల టచ్‌స్ర్కీన్, మొబైల్ కనెక్టివిటీ వంటి సదుపాయాలతో వచ్చిందీ ద్విచక్రవాహనం. కార్ల దిగ్గజం టెస్లా కూడా ఇండియాలో విద్యుత్‌కార్ల డిమాండ్‌ను పరిశీలిస్తోంది. హుందయ్, మారుతి, నిస్సాన్, మహీంద్ర, టాటా, హోండా, టయోటా వంటి ఆటోమొబైల్ సంస్థలన్నీ వచ్చే రెండు మూడేళ్లలో.. పాతిక మోడళ్లను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇక, అద్దె కార్లు కూడా ఎలక్ట్రిక్ కార్లలోకి మారిపోతున్నాయి. నాగపూర్‌లో ‘ఓలా ఎలక్ట్రిక్ వెహికల్ ప్రాజెక్ట్’ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. క్యాబ్‌లు, ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలు, బస్సులను అద్దెకు తిప్పనుందా కంపెనీ. బెంగళూరులో లిథియమ్ అర్బన్ టెక్నాలజీస్ అద్దె కార్లన్నీ ఎలక్ట్రిక్‌వే! అదే నగరానికి చెందిన భగీరథి గ్రూప్ కూడా మహీంద్రాతో ఒప్పందం పెట్టుకుని.. కరెంటు క్యాబ్‌లను అద్దెకు తిప్పుతోంది. సాధారణ కార్ల ధరలతో పోలిస్తే.. ఈ-కార్ల అద్దెలు చాలా తక్కువ. అందులోనూ పర్యావరణానికి హాని ఉండదు. ‘ఎన్విరాన్‌మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్’లో 180 దేశాలకు గాను 171వ స్థానంలో ఉన్న భారత్‌ను.. పైకి తీసుకు రావాలంటే.. కరెంటు కార్లు పెరగక తప్పదు.
తెలుగు రాష్ట్రాల్లోనూ సందడి..
‘అమరావతిలో ఛార్జింగ్ స్టేషన్లు..’
‘తిరుపతిలో ఎలక్ట్రిక్ వాహనాలు..’
‘హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లో విద్యుత్ వాహనాలు..’
‘తెలంగాణ రాజధానిలో కరెంటు బస్సుల తయారీ’
రేపటి తరానికి పనికొచ్చే ఐడియాలను ఇతర రాష్ట్రాలు అందిపుచ్చుకుంటాయో లేదో కానీ.. రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రం ముందు వరుసలో ఉంటాయనేందుకు.. ఈ వార్తా శీర్షికలే నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా కరెంటు కార్ల ప్రాధాన్యాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ఎప్పుడో గుర్తించాయి. కొత్త రాజధాని అమరావతి నిర్మాణదశలో ఉండటంతో.. పనిలోపనిగా ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. కొత్త సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ కార్లకు ఛార్జింగ్ స్టేషన్లను నెలకొల్పనుంది. రాజధాని నిర్మాణంలోనూ పర్యావరణానికి ప్రాధాన్యం ఇస్తున్న తరుణంలో.. వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు కృషి చేస్తోంది. విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ‘ఎలక్ట్రిక్ మొబిలిటీ’ విధానాన్ని సైతం ప్రకటించింది. విద్యుత్ కార్లు, బ్యాటరీల తయారీ సంస్థలకు రాయితీలను ఇచ్చి, ప్రోత్సహిస్తోంది.
2023 నాటికి పదిలక్షల విద్యుత్ వాహనాలను లక్ష్యంగా పెట్టుకున్న తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వచ్చే ఐదేళ్లలో ఈ-వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజులు, పన్నులు తిరిగి వాహనదారులకు చెల్లించే ప్రతిపాదన కూడా ఉంది. దక్షిణ కొరియా కార్ల సంస్థ కియా ఇప్పటికే అనంతపురం జిల్లాలో అతి పెద్ద ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇదే ప్లాంటు నుంచి.. 2021 నాటికి విద్యుత్, హైబ్రిడ్ కార్లు ఉత్పత్తి కానున్నాయి. భారత్‌లో తొలి లిథియం ఇయాన్ బ్యాటరీల తయారీ సంస్థ కూడా ఆంధ్రాలోనే ఏర్పాటు అవుతోంది. ఈ రికార్డుకు మరొక ఘనత జత కలిసింది. తిరుమల-తిరుపతి దేవస్థానంలో త్వరలోనే 350 విద్యుత్ వాహనాలు రానున్నాయి. ఒక పుణ్యక్షేత్రంలో ఇన్నేసి కరెంటు వాహనాలు రావడం ఇదే తొలిసారి. దశలవారీగా ప్రభుత్వ రవాణా వ్యవస్థను విద్యుత్ వాహనాలతో భర్తీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ దిశగా మరో అడుగు - టయోటాతో ఒప్పందం. ఈ కంపెనీ అమరావతిలో కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టనుంది.
తెలంగాణ కూడా విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టడంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఇటీవలే మెట్రో స్టేషన్లలో విద్యుత్ అద్దె వాహనాలను పరిచయం చేసింది. ఒక ప్రైవేటు కంపెనీతో కలిసి దేశంలోనే తొలి మెట్రో అద్దె కార్లను అందించిన ఘనత ఈ రాష్ట్రానికే దక్కుతుంది. అన్ని మెట్రో స్టేషన్లలోనూ ఛార్జింగ్ పాయింట్లు రానున్నాయి. తొలి దశలో సుమారు 64 స్టేషన్లలో విద్యుత్ కార్లకు ఛార్జింగ్ చేసుకునే సదుపాయం కలగనుంది. చైనా సంస్థ బిల్డ్ యువర్ డ్రీమ్స్ కూడా హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సుల్ని తయారుచేసేందుకు పూనుకుంది. మొదట సుమారు ఐదొందల బస్సులు ఉత్పత్తి కానున్నాయి. ఈ బస్సులకు ఒక్కసారి ఛార్జింగ్ చేసుకుంటే.. నాలుగు వందల కిలోమీటర్లు హాయిగా ప్రయాణించవచ్చు. ఆ చైనా సంస్థతో కలిసి హైదరాబాద్ కంపెనీ గోల్డ్‌స్టోన్ ఇన్‌ఫ్రాటెక్ కూడా ఐదువేల విద్యుత్ బస్సులను ఉత్పత్తి చేసేందుకు పూనుకుంది.
విద్యుత్ వాహనాలు పెరగాలంటే.. అటు సంస్థలకు, ఇటు వాహనదారులకు ప్రోత్సాహకాలు అందివ్వాలి. అపార్ట్‌మెంట్లు, షాపింగ్‌మాల్స్, మల్టీప్లెక్స్‌లు, జాతీయరహదారుల్లో విరివిగా ఛార్జింగ్ స్టేషన్లు రావాలి. కార్ల బ్యాటరీల ధరలు అందుబాటులో ఉండాలి. ఇవన్నీ సమకూరడానికి కొన్నేళ్లు పట్టొచ్చు. కానీ, విద్యుత్ కార్లను మాత్రం ఇక ఆపలేం. ఒకప్పుడు ఐటీ విప్లవం.. ఈ మధ్యన మొబైల్ సంచలనంలాగే.. రాబోయే ఉప్పెన ఎలక్ట్రిక్ వెహికల్. సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టుకున్నంత సులువుగా కారును రీఛార్జి చేసుకోవచ్చు. పెట్రోలు బంకుల్లో మీటరువైపు చూడక్కర్లేదు. కాలుష్యం సమస్యే రాదు. రోడ్లన్నీ కరెంటు కార్లతో నిండిపోతే.. చుక్కలు చూపిస్తున్న పెట్రోలు, డీజిల్ ధరలకు అదో పెద్ద షాకే!!
కరెంటుకార్లలో గేర్‌బాక్స్, క్లచ్‌లు ఉండవు. డ్రైవింగ్‌కు భలే సౌఖ్యం.
పెట్రోలు కారుతో పోలిస్తే.. వీటితో ఏడాదికి రూ.70 వేల ఆదా.
పెట్రోలు కారు ఖర్చు కి.మీ.కు రూ.5.40. అదే కరెంటు కారుకు అయితే 0.80 పైసలు.
సాధారణ పెట్రోలు కారుకు గంట అద్దె రూ.130. అదే విద్యుత్ వాహనం అయితే కేవలం రూ.40.
మెట్రో స్టేషన్‌లో ఛార్జింగ్ సెంటర్లను పెట్టిన తొలి రాష్ట్రం తెలంగాణ. హైదరాబాద్‌లో ఇటీవలే ప్రారంభం.
ఈవీ కార్ల నమూనాకు తొలి రూపం ఇచ్చింది టెస్లా.
హైదరాబాద్‌లోని అన్ని మెట్రోస్టేషన్లలో ఎలక్ట్రిక్ కార్లకు ఛార్జింగ్ సదుపాయం.
గత ఏడాది భారత్‌లో 30.46 లక్షల పెట్రోలు, డీజిల్ కార్లు అమ్ముడుబోతే.. 2000 ఎలక్ట్రిక్ కార్లు కూడా కొన్నారు.
మన దేశంలో ఇప్పటి వరకు 353 ఛార్జింగ్ స్టేషన్లు మాత్రమే ఉన్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో కర్ణాటక ముందుంది. అక్కడ రూ.31 వేల కోట్ల పెట్టుబడులు, 55 వేల కొత్త ఉద్యోగాలు రానున్నాయ్.
కరెంటు వాహనాలతో కళకళలాడనున్న తొలి దివ్యక్షేత్రం తిరుపతి. త్వరలో అక్కడికి 350 వాహనాలు వస్తున్నాయి.
అనంతపురంలో ఏర్పాటైన కియా కంపెనీ ఏడాదికి 3 లక్షల కార్లను ఉత్పత్తి చేయనుంది. అందులో విద్యుత్ కార్లదీ అధిక వాటానే!.
కరెంటు కార్లలో చైనాను కొట్టే మొనగాడు లేడు. ఇప్పటికైతే అదే లీడర్.
విద్యుత్ కార్ల వల్ల 40 శాతం కాలుష్యం తగ్గుతుంది.
అద్దె కార్లన్నీ ఈవీ బాట పట్టనున్నాయ్.
పెట్రోలు కంటే డీజీల్ ఎస్‌యువి విడుదల చేసే కాలుష్యం 25 నుంచి 65 రెట్లు ఎక్కువ.
హుందయ్, మారుతి, మహీంద్ర, నిస్సాన్, ఆడి, టెస్లా, బెంజ్, టాటా.. తదితర కంపెనీలన్నీ ఈ రంగంలోకి వచ్చేశాయ్.
ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 150 నుంచి 300 కిలోమీటర్లు వెళ్లొచ్చు.
50 వేల కిలోమీటర్లు తిరిగాక బ్యాటరీ మార్చుకోవాలి. విద్యుత్ కార్లకు సర్వీసింగ్, మెయింటెనెస్స్ చాలా చౌక.
శబ్ద కాలుష్యం బాగా తగ్గుతుంది.
భారతీయ రహదారుల మీద మరో మూడేళ్లలో 25 మోడళ్ల విద్యుత్ కార్లు దౌడు తీస్తాయ్.
2030 నాటికి డీజిల్, పెట్రోలు కార్ల రిజిస్ట్రేషన్లు ఆపేస్తే మంచిదన్నది నీతి అయోగ్ సలహా.
రెండు గంటల్లోపే ఛార్జింగ్ చేసుకునే అత్యాధునికసాంకేతికత వస్తోంది.
జాతీయ రహదారుల్లో అయితే ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్.
నగరాల్లో ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్.
ప్రపంచంలోని35 అత్యంత కాలుష్య నగరాలలో 19 మన దేశంలోనే ఉండటం విషాదం.
ఎలక్ట్రిక్ కారును కనుగొన్నది ఇప్పుడు కాదు. 1837లో.
ఇండియాలో ఇప్పటికే 4.5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) తిరుగుతున్నాయంటే నమ్మగలరా?.
ఉచిత పార్కింగ్ లభిస్తుంది. టోల్‌ప్లాజా రుసుమూ ఉండకపోవచ్చు.
ఏమొస్తున్నాయ్?
ఒకప్పుడు విద్యుత్‌కారు ఊరించే కల. ఇప్పుడు పాతిక మోడళ్లు రెండు మూడేళ్లలో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. మహీంద్రా, నిస్సాన్, హుందయ్, మారుతి, హోండా, రెనో, టాటా, టెస్లా... వరుసకట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే మహీంద్రా విద్యుత్‌కార్ల ఉత్పత్తిలో ముందంజలో ఉంది. హ్యుందయ్ ‘కోన’, ‘అయొనిక్’, మహీంద్రా ‘ఈ-కెయువి 100’ సిద్ధమవుతున్నాయి. ఈ- వెరిటో, ఈ2వొ వచ్చేశాయ్. హోండా స్పోర్స్ట్ ఈవీ రానుంది. మారుతి ఈ-సర్‌వైవర్ పేరుతో జిప్సీని విడుదల చేయనుంది. నిస్సాన్ ‘లీప్’, టెస్లా ‘మోడల్3’, టాటా ‘టిగోర్ ఈవీ’, ‘నానో ఈవీ’లు కొత్తతరాన్ని ఆకట్టుకోనున్నాయి. రేనల్ట్ ‘ట్రేజర్’ కూడా ఇదే వరుసలో ఉంది. ఇవన్నీ ఒక్కసారి ఛార్జింగ్ చేసుకుంటే.. 150 నుంచి 300 కి.మీ.లు ప్రయాణించొచ్చు. ఎలక్ట్రిక్ ఇంధనంతో నడిచే బస్సులకు కూడా మన దేశం ప్రాధాన్యం ఇస్తోంది. తొలిదశలో విద్యుత్ బస్సులే అధికంగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
No comments:
Post a Comment