కోస్తాంధ్ర కోవెలలు.. భక్తి సౌందర్య సుమాల
ఆంధ్రప్రదేశ్‌లోని సువిశాలమైన తీర ప్రాంతం అరుదైన, అత్యద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయం కోస్తాంధ్ర ప్రాంతం. అన్నవరం, మంగళగిరి తదితర వైష్ణవ క్షేత్రాలూ, అపురూప శైవ క్షేత్రాలైన పంచారామాలు... ఇలా ఎన్నో ఆలయాలు కోస్తాంధ్ర పొడవునా కొలువు తీరాయి.
తూర్పుగోదావరి జిల్లాలో...
అన్నవరం సత్యనారాయణుడు
పంపానది సమీపంలో రత్నగిరిపై కొలువైన అన్నవరం శ్రీవీర వేంకట సత్యనారాయణస్వామి ఆలయం తెలుగు రాష్ట్రాల్లోని సుప్రసిద్ధ క్షేత్రాల్లో ఒకటి. స్వామివారి సన్నిధిలో వ్రతాలు చేయడం వల్ల కుటుంబాలకు క్షేమం చేకూరుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.
ఎలా వెళ్ళాలంటే...
ఈ ఆలయం కాకినాడ నుంచి 40 కి.మీ. దూరంలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాలన్నిటి నుంచీ రైలు, బస్సు సదుపాయాలున్నాయి.
త్రిలింగ క్షేత్రం ద్రాక్షారామం
త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా ద్రాక్షారామం ప్రసిద్ధి పొందింది. దక్షిణకాశీగా ఎందరో కవులు కొనియాడిన ఈ క్షేత్రంలో భీమేశ్వరస్వామి కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో శివుని లింగం 26 అడుగుల ఎత్తులో ఉంటుంది.
ఎలా వెళ్ళాలంటే...
కాకినాడ నుంచి 30 కి.మీ. దూరంలో ద్రాక్షారామం ఉంది. రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.
శక్తి పీఠం, దత్త క్షేత్రం
పిఠాపురంలోని పురుహూతికా దేవి ఆలయం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. దత్తాత్రేయ స్వామి శ్రీపాద వల్లభునిగా తొలి అవతారం ఎత్తిన ప్రదేశం కూడా ఇదేనని చెబుతారు. పురుహూతికాదేవి ఆలయ ప్రాంగణంలోనే శ్రీకుక్కుటేశ్వరస్వామి ఆలయం, కాస్తంత దూరాన ఉన్న కుంతీమాధవస్వామి ఆలయాలు ఇక్కడ చూడదగిన ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశాలు.
ఎలా వెళ్ళాలంటే...
కాకినాడకు 20 కి.మీ., సామర్లకోటకు 14 కి.మీ. దూరంలో పిఠాపురం ఉంది.
మరికొన్ని
తూర్పుగోదావరి జిల్లాలో దర్శించుకోదగ్గ ప్రధాన పుణ్య స్థలాల్లో సామర్లకోట కుమార భీమేశ్వరాలయం, తలపులమ్మ లోవ, బిక్కవోలు సుబ్రహ్మణ్యస్వామి, వినాయకుని ఆలయాలు, గొల్లలమామిడాడ సూర్యదేవాలయం, ద్వారపూడి ఆలయాలు, అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి, అయినవిల్లి శ్రీసిద్దివినాయకుడు, శ్రీక్షణముక్తేశ్వరస్వామి ఆలయం, మురమళ్ళ శ్రీభద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి, కుండలేశ్వరస్వామి, అప్పనపల్లి బాలబాలాజీ, కడలిలోని శ్రీకపోతేశ్వరస్వామి వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం, మందపల్లి శ్రీశనేశ్వర (మందేశ్వర) స్వామి, పలివెల శ్రీఉమాకొప్పులింగేశ్వర స్వామి, ర్యాలీ శ్రీజగన్మోహినీ కేశవస్వామి, కోటిపల్లి శ్రీ ఛాయాసోమేశ్వరుని ఆలయాలు ప్రధానమైనవి.
పశ్చిమ గోదావరి జిల్లా...
చిన్న తిరుపతి
చిన్నతిరుపతిగా పేరుపొందిన ద్వారకాతిరుమల ఆలయం ఆహ్లాదకరమైన వాతావరణంతో ఆకర్షిస్తుంది. ఇక్కడ ఎత్తయిన కొండ మీద వేంకటేశ్వరస్వామి స్వయంభువుగా వెలిశారు. స్వామివారి కల్యాణాలు, నిత్య అన్నదానాలతో అలరారుతున్న క్షేత్రం ఇది.
ఎలా వెళ్ళాలంటే...
ఏలూరుకు 40 కి.మీ దూరంలో ద్వారకా తిరుమల ఉంది. రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.
సోమారామం, క్షీరారామం
సుప్రసిద్ధ పంచారామ క్షేత్రాల్లో భీమవరం సోమారామం ఒకటి. ఇక్కడి శివలింగం అమావాస్య రోజున గోదుమ రంగులో, పౌర్ణమి నాడు శ్వేత వర్ణంలో కనిపిస్తుంది. పంచారామ క్షేత్రాల్లోని క్షీరారామం పాలకొల్లులో ఉంది. ఈ ఆలయం గాలిగోపురం 36.6 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
ఎలా వెళ్ళాలంటే...
రాజమండ్రికి 75 కి.మీ. దూరంలో భీమవరం నుంచి 68 కి.మీ. దూరంలో పాలకొల్లు ఉన్నాయి.
మరికొన్ని
భీమవరంలోని భీమేశ్వరాలయం, మావుళ్ళమ్మ గుడి, కొల్లేరు పెద్దింట్లమ్మ, పెనుగొండ వాసవీ కన్యకా పరమేశ్వరి, మద్ది ఆంజనేయస్వామి, పట్టిసీమ వీరభద్రస్వామి ఆలయాలు ఈ జిల్లాలో చూడదగిన మరికొన్ని ప్రధాన ఆలయాలు.
కృష్ణా జిల్లాలో...
సకల దోషహరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు
కృష్ణా జిల్లా మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వరుడు సకల దోషహరునిగా, కొలిచేవారికి కల్పవృక్షంగా ప్రసిద్ధి చెందాడు. ప్రత్యేకించి సంతాన ప్రాప్తికీ, కుజ, నాగ దోషాల నివారణకూ ఈ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు.
ఎలా వెళ్ళాలంటే...
విజయవాడకు 68 కి.మీ. దూరంలో మోపిదేవి ఉంది. రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.
శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు
శ్రీకాకుళంలో మహావిష్ణువు కొలువైన శ్రీకాకుళేశ్వర స్వామి ఆలయం 108 వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటి. ఈ స్వామినే ‘ఆంధ్ర మహా విష్ణువు’ అని కూడా పిలుస్తారు. శ్రీకాకుళాన్ని రాజధానిగా చేసుకొని పాలించిన ఆంధ్ర రాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది.
ఎలా వెళ్ళాలంటే...
విజయవాడకు 40 కి.మీ. దూరంలో శ్రీకాకుళం గ్రామం ఉంది. రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.
పెదకళ్ళేపల్లి దుర్గానాగేశ్వరుడు
దివిసీమలోని శివ క్షేత్రాల్లో అత్యంత ప్రాచీనమైనది మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలోని శ్రీ దుర్గానాగేశ్వరుని ఆలయం. ఇక్కడ ఉత్తర వాహినిగా కృష్ణానది ప్రవహిస్తుంది. ఈ ఆలయంలోని శివలింగాన్ని మహా సర్పాలు ప్రతిష్ఠించాయనీ, వశిష్టాది ఋషులు ఈ ప్రాంతంలో తపస్సు చేశారనీ స్థల పురాణం చెబుతోంది.
ఎలా వెళ్ళాలంటే...
విజయవాడకు సుమారు 75 కి.మీ., మోపిదేవికి 8 కి.మీ. దూరంలో పెదకళ్ళేపల్లి ఉంది.
మరికొన్ని:
విజయవాడ నగరంలోని ప్రకాశం బ్యారేజీకి అతి సమీపంలో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయం, హంసలదీవి వేణుగోపాల స్వామి, మచిలీపట్నంలో పాండురంగస్వామి, కొల్లేరు పెద్దింట్లమ్మ, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ, సంగమేశ్వరంలోని శ్రీ గంగాపార్వతీ సమేత శ్రీ సంగమేశ్వరస్వామి, నడకుదురు పృధ్వీశ్వర స్వామి, బలివే రామలింగేశ్వర స్వామి, సింగరాయపాలెం శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఘంటసాల జలధీశ్వరస్వామి,సంగమేశ్వరస్వామి, వేదాద్రి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి, నెమలి వేణుగోపాస్వామి, డోకిపర్రు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలు ఈ జిల్లాలోని సందర్శనీయ ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ప్రధానమైనవి.
గుంటూరు జిల్లా...
భక్త సులభుడు అమరేశ్వరుడు
భక్త సులభుడు అమరేశ్వరుడు
గుంటూరు జిల్లా అమరావతిలో వెలసిన అమరేశ్వరస్వామి భక్త సులభుడిగా ఖ్యాతిగాంచాడు. పంచారామ క్ష్షేత్రాల్లో అమరావతి ఒకటి. గర్భాలయంలో మహాశివ లింగం దంతపు రంగులో, పదిహేను అడుగుల ఎత్తున ఉంటుంది.. అమరావతి సుప్రసిద్ధమైన బౌద్ధ క్షేత్రం కూడా.
ఎలా వెళ్ళాలంటే...
గుంటూరు నుంచి 33 కి.మీ., విజయవాడ నుంచి 43 కి.మీ. దూరంలో అమరావతి ఉంది.
ఎల్లమంద కోటయ్య
మూడు శిఖరాలతో త్రికూటాచలంగా పేరు పొందిన పుణ్య స్థలం కోటప్ప కొండ. ఎల్లమంద కోటయ్యగా భక్తులు పిలుచుకొనే ఇక్కడి శివుడు త్రికూటాచలేశ్వరునిగా పూజలందుకుంటున్నాడు. ఈ ప్రాంతంలోని మూడు శిఖరాలనూ బ్రహ్మ, విష్ణు, రుద్ర స్వరూపాలుగా భక్తులు భావిస్తారు. స్వామిని దక్షిణామూర్తిగా కొలుస్తారు.
ఎలా వెళ్ళాలంటే...
గుంటూరుకు 63 కి.మీ. దూరంలో కోటప్ప కొండ ఉంది.
మంగళగిరి పానకాల స్వామి
మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పానకాల స్వామిగా సుప్రసిద్ధుడు. ఇక్కడ నరసింహుడి విగ్రహం నోట్లో ఎంత పానకం పోసినా సగమే లోపలికి పోతుందని చెబుతారు. ఈ ఆలయ గాలిగోపురం ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యంత ఎత్తయినది.
ఎలా వెళ్ళాలంటే...
విజయవాడకు 16 కి.మీ., గుంటూరుకు 24 కి.మీ. దూరంలో మంగళగిరి ఉంది.
మరికొన్ని:
వైకుంఠపురం వేంకటేశ్వరస్వామి ఆలయం, ధరణికోట బలుసులమ్మ, వినాయక ఆలయాలు, మల్లాదిలోని వేంకటేశ్వరస్వామి, అభయాంజనేయ స్వామి, బాపట్ల భావనారాయణస్వామి, సీతానగరం సోమేశ్వర స్వామి, చేజర్ల కపోతేశ్వరస్వామి, చేబ్రోలు చతుర్ముఖ బ్రహ్మ, కారంపూడి, మాచర్ల చెన్న కేశవ స్వామి ఆలయాలు ఈ జిల్లాలో సందర్శించదగిన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాలు.
నెల్లూరు జిల్లాలో...
తల్పగిరి రంగనాథస్వామి
నెల్లూరు పట్టణంలోని తల్పగిరి రంగనాథస్వామి ఆలయం సందర్శకులను పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తోంది. వంద అడుగుల తూర్పు రాజగోపురం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. తమిళనాడులోని శ్రీరంగపట్నం, కర్నాటక శ్రీరంగం ఆలయాల వరుసలో- ఇది మూడవ శ్రీరంగంగా, ఉత్తర శ్రీరంగంగా పేరుపొందింది.
చల్లని తల్లి చెంగాళమ్మ
సూళ్ళూరు పేటలోని చెంగాళమ్మ చల్లని తల్లిగా పేరుపొందింది. రోజంతా తెరిచి ఉండే ఈ ఆలయానికి తలుపులు లేకపోవడం విశేషం.
ఎలా వెళ్ళాలంటే...
నెల్లూరుకు 100 కి.మీ., చెన్నై నగరానికి 83 కి.మీ. దూరంలో సూళ్ళూరుపేట ఉంది. రైలు, రోడ్డు మార్గాల్లో చేరుకోవచ్చు.
మరికొన్ని:
ఘటికసిద్ధేశ్వరం శైవక్షేత్రం, సోమశిల ప్రాజెక్టు వద్ద నిర్మించిన సోమేశ్వరస్వామి ఆలయం, వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి, (నరసింహులు కొండ), మన్నారుపోలూరు అళఘమల్లారి కృష్ణస్వామి, పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి, గొలగమూడి భగవాన్ గొల్లమూడి వెంకయ్యస్వామి ఆశ్రమం, వెంకటగిరి పోలేరమ్మ, తూర్పుకనుపూరు ముత్యాలమ్మ, కావలి కలుగోళమ్మ, నరవాడ వెంగమాంబ పేరంటాలు, ఇరుకళల పరమేశ్వరాలయం, మల్లం సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, ఇందుకూరుపేట చాముండేశ్వరి ఆలయాలు, ఈ జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలుగా భక్తులను ఆకర్షిస్తున్నాయి.
ప్రకాశం జిల్లాలో...
సింగరాయకొండ శ్రీవరాహ లక్ష్మీ నృసింహుడు
ప్రకాశం జిల్లా జిల్లాలోని సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండలో వెలసిన శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి మహోగ్ర రూపంతో దర్శనమిస్తాడు. ఈ క్షేత్రం ‘దక్షిణ సింహాచలం’గా ప్రసిద్ధి చెందింది.
ఎలా వెళ్ళాలంటే...
ఒంగోలుకు సుమారు 30 కి.మీ దూరంలో ఈ ఆలయం ఉంది.
వారానికి ఒకరోజే దర్శనం
మాల్యాద్రిగా వ్వవహరించే మాలకొండలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఒక విశిష్టత ఉంది. వారానికి ఒక రోజు, కేవలం శనివారం మాత్రమే ఈ ఆలయాన్ని తెరుస్తారు. గుహలలో ఒక బండపై కొలువై లక్ష్మీ నృసింహుడు భక్తులకు దర్శనం ఇస్తాడు.
ఎలా వెళ్ళాలంటే...
ఒంగోలుకు 77 కి.మీ., కందుకూరు నుంచి 34 కి.మీ. దూరంలో మాలకొండ ఉంది.
ఒకే రాతిలో ఎనిమిది ఆలయాలు
ప్రకాశం జిల్లాలోని ప్రముఖ శివాలయాల్లో భైరవకోన దుర్గా భైరవేశ్వరస్వామి ఆలయం ఒకటి. ఇక్కడ ఒకే రాతిలో ఎనిమిది శివాలయాలను చెక్కడం విశేషం.
ఎలా వెళ్ళాలంటే...
కనిగిరికి సుమారు 62 కి.మీ. దూరంలో భైరవ కోన ఉంది.
మరికొన్ని:
ఒంగోలు, మార్కాపురం చెన్నకేశవస్వామి, త్రిపురాంతకం త్రిపురాంతకేశ్వరస్వామి, నర్శింగోలు శనీశ్వరుడు, మొగిలిచెర్ల, రామ తీర్థంశివాలయాలు, మిట్టపాలెం నారాయణస్వామి, వెంగళాపురం గంగమ్మ తల్లి, పొదిలి మహేశ్వరుడు, వెలిగొండ వేంకటేశ్వర స్వామి, ఒంగోలు సమీపంలోని వల్లూరమ్మ ఆలయాలు, అద్దంకి ప్రాంతంలో వెయ్యి స్తంభాల గుడి, మణికేశ్వర శివాలయం, మల్లవరం వేంకటేశ్వర స్వామి ఆలయాలు, జమ్ములపాలెంలోని వెయ్యిన్నొక్క శివలింగాల శివాలయం ఈ జిల్లాలో సుప్రసిద్ధమైన వాటిలో కొన్ని.
No comments:
Post a Comment