రిటర్నులకు వేళాయె...
ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించాల్సిన తరుణమిది. 2017-18 ఆర్థిక సంవత్సరం (2018-19 అసెస్‌మెంట్ ఇయర్)కు సంబంధించి రిటర్నులు దాఖలు చేసేందుకు గడువు జులై 31, 2018. ఈ నేపథ్యంలో ఏ సెక్షన్ల కింద ఎంత మినహాయింపు లభిస్తుంది? రిటర్నులు దాఖలు చేసేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
చెల్లించాల్సిన పన్ను చెల్లించేశాం.. ఇంకా రిటర్నుల దాఖలు ఎందుకు అనే సందేహం చాలామందికి వస్తుంటుంది. చట్టబద్ధంగా మీ ఆదాయం అధీకృతం కావాలంటే.. ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారికి ఇప్పటికే వారి కార్యాలయాల్లో ఫారం-16 ఇచ్చేయడమో.. త్వరలో ఇవ్వడమో జరుగుతుంది. మీ ఆదాయం, మినహాయింపులకు సంబంధించిన అన్ని విషయాలూ అందులోనే ఉంటాయి. ఆయా సెక్షన్ల కింద మినహాయింపులు సరిగ్గా నమోదయ్యాయా లేదా అనేది ఇప్పుడు చూసుకోవాల్సిన విషయం.
ముందు ఇవి చూడండి..
రిటర్నులు దాఖలు చేయడానికి ముందు.. మీరు పరిశీలించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి..
* ప్రస్తుతం మనం 2017-18 ఆర్థిక సంవత్సరానికి రిటర్నులు దాఖలు చేస్తున్నాం. అంటే.. అసెస్‌మెంట్ ఇయర్ 2018-19 అన్నమాట. గడిచిన ఆర్థిక సంవత్సరంలో మీరు చెల్లించిన మూలం వద్ద పన్ను మనిహాయింపు, లేదా మీరు స్వయంగా చెల్లించిన ముందస్తు పన్నులాంటివి మీ ఖాతాలో నమోదయ్యాయా లేదా చూసుకోవాలి. దీనికోసం ఫారం-26ఏఎస్‌ను పరిశీలించాలి.
* ఒకవేళ మీరు మూలం వద్ద చెల్లించిన పన్ను వివరాలు ‘ఫారం 26ఏఎస్’లో నమోదుకాని సందర్భాల్లో మూలం వద్ద పనుఉన మినహాయించిన వారిని సంప్రదించి, సరిచేసుకోవాలి.
* మీరు కోరిన మినహాయింపులకు తగిన ఆధారాలు మీ వద్ద ఉండాలి. ఇప్పటికే కార్యాలయంలో అందించినా.. వాటి నకలు మీదగ్గర ఉండటం ఉత్తమం.
* ఫారం-16లోనూ, ఫారం 26ఏఎస్‌లోనూ అన్ని వివరాలూ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. పాన్, ఆధార్ అనుసంధానం అయిన నేపథ్యంలో తప్పులు దొర్లితే తర్వాత ఇబ్బందులు రావచ్చు. అలాంటివి ఉంటే సరిచేసుకోవాలి.
దాఖలు ఇలా...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు www.incometaxindiaefiling.gov.in వెబ్‌సైటులోకి వెళ్లాలి. ఇదే అధీకృత వెబ్‌సైటు. కొన్ని ప్రైవేటు వెబ్‌సైట్లు పన్ను రిటర్నులను మీ తరఫున దాఖలు చేస్తున్నాయి. వీటిని ఎంపిక చేసుకునేప్పుడు కాస్త జాగ్రత్త. ఇన్‌కంట్యాక్స్ వెబ్‌సైటులోకి మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ద్వారా ప్రవేశించి వివరాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతాకు ‘పాన్’ అనుసంధానమై ఉండి, మీరు ఆన్‌లైన్ ఖాతాను వినియోగిస్తుంటే.. అక్కడి నుంచి కూడా ఇందులోకి వెళ్లవచ్చు.
* అక్కడ సూచనలను బట్టి, మీకు వర్తించే ఫారాన్ని ఎంచుకొని, ఆదాయం, మినహాయింపులు, బ్యాంకు ఖాతా వివరాల్లాంటివి పూర్తి చేయాలి.
* రిటర్నులు పూర్తి చేసిన తర్వాత, నెట్ బ్యాంకింగ్, ఆధార్‌కార్డు, ఈవీసీ ద్వారా దాన్ని ఈ వెరిఫై చేయాలి. లేదా వచ్చిన అక్నాలజ్‌మెంట్‌ను సీపీసీ బెంగళూరుకు 120 రోజుల్లోగా పంపించాల్సి ఉంటుంది.
మినహాయింపులు ఇవీ..
చట్టం నిర్దేశించిన ఆదాయ పరిమితి దాటినప్పటికీ.. కొన్ని సెక్షన్ల కింద మినహాయింపు పొందే అవకాశం ఉంది. మరి, ఇందులో ముఖ్యమైన సెక్షన్ల సంగతేమిటో చూద్దాం. రిటర్నులు సమర్పించేప్పుడు ముఖ్యంగా ఈ మినహాయింపులను ఒకసారి సరిచూసుకోవాలి.
సెక్షన్ 80సీ: ఈ సెక్షన్ కింద గరిష్ఠంగా రూ.1,50,000 వరకూ మినహాయింపు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ సెక్షన్ కింద ఏయే పెట్టుబడి పథకాలు వస్తాయంటే..
* ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్)
* ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్)
* ఐదేళ్ల బ్యాంకు పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్లు
* జాతీయ పొదుపు పథకాలు
* ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్ పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్)
* గరిష్ఠంగా ఇద్దరు పిల్లలకు చెల్లించిన ట్యూషన్ ఫీజు
* జీవిత బీమా పాలసీలకు చెల్లించిన ప్రీమియం
* సుకన్య సమృద్ధి యోజన
* పోస్టాఫీసు పెద్దల పొదుపు పథకం
* ఇంటి రుణానికి చెల్లించిన అసలు
* జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్)
* నాబార్డ్ రూరల్ బాండ్లు
* కొత్త ఇంటిని కొనుగోలు చేసినప్పుడు చెల్లించిన స్టాంపు డ్యూటీ
* ఈ సెక్షన్‌లో భాగంగా మరో రెండు సెక్షన్లు ఉంటాయి.
80సీసీసీ: జీవిత బీమా సంస్థలు అందించే యాన్యుటీల కొనుగోలు. సెక్షన్ 80
* సీసీడీ: ఉద్యోగులు ఎన్‌పీఎస్ కోసం చేసిన రూ.50వేల వరకూ చేసిన అదనపు చెల్లింపును ఇందులో తీసుకుంటారు.
* ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే..ఈ మూడు సెక్షన్ల కిందా కలిపి మొత్తంగా రూ.1,50,000 వరకే మినహాయింపు వర్తిస్తుంది.
* సెక్షన్ డీ: ఆరోగ్య బీమా పాలసీకి చెల్లించిన ప్రీమియానికి వర్తించే సెక్షన్ ఇది.
* సొంతంగా, జీవిత భాగస్వామి, పిల్లలకు కలిపి తీసుకున్న పాలసీకి రూ.25వేలు. సీనియర్ సిటిజన్ అయితే.. రూ.30,000
* తల్లిదండ్రుల కోసం తీసుకున్న పాలసీకి రూ.25 వేలు. సీనియర్ సిటిజన్ తల్లిదండ్రుల కోసం పాలసీ తీసుకుంటే.. రూ.30వేలు అదనపు మినహాయింపు లభిస్తుంది.
* ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకు చేసిన ఖర్చు గరిష్ఠంగా రూ.5వేల వరకూ ఇందులో చూపించుకోవచ్చు. అయితే, ఇది మొత్తం సెక్షన్ మినహాయింపునకు లోబడే ఉంటుంది.
సెక్షన్ 80డీడీబీ: దీర్ఘకాల వ్యాధుల చికిత్సకు సొంతానికైనా.. తన మీద ఆధారపడిన వారికైనా ఖర్చు చేసే మొత్తానికి వర్తించే సెక్షన్ ఇది. 60ఏళ్లలోపు వారికి రూ.40వేల వరకూ, 60-80 ఏళ్ల మధ్య వారికి రూ.60వేల వరకూ, 80 ఏళ్లు దాటిన వారికి రూ.80వేల వరకూ మినహాయింపు వర్తిస్తుంది.
* సెక్షన్ 80డీడీ: పన్ను చెల్లింపుదారుడిపైన వైకల్యం ఉన్న వ్యక్తులు ఆధారపడినప్పుడు.. వారికి 40శాతం వైకల్యం ఉంటే.. రూ.70వేలు, 80శాతం మించి ఉంటే.. 1,25,000వరకూ మినహాయింపు పొందవచ్చు.
* సెక్షన్ 80యూ: ఇది సెక్షన్ 80డీడీలాంటిదే. కానీ.. పన్ను చెల్లింపుదారుడికి వైకల్యం ఉన్నప్పుడు వర్తిస్తుంది.
* సెక్షన్ 80ఈ: పిల్లల ఉన్నత విద్యాభ్యాసం కోసం తీసుకున్న విద్యారుణంపై చెల్లించే వడ్డీకి పూర్తి మినహాయింపు లభిస్తుంది.
* సెక్షన్ 80టీటీఏ: పొదుపు ఖాతాలో జమైన వడ్డీ మొత్తానికి రూ.10వేల వరకూ మినహాయింపు ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చిన వడ్డీకి ఈ సెక్షన్ వర్తించదు.
* సెక్షన్ 80జీజీ: ఉద్యోగం చేసేవారు.. తమ యాజమాన్యం నుంచి ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) పొందనప్పుడు ఈ సెక్షన్ కింద కొన్ని నిబంధనల మేరకు రూ.60వేల వరకూ మినహాయింపు చూపించుకోవచ్చు.
* సెక్షన్ 80జీ: చట్టబద్ధంగా మీరిచ్చిన విరాళాలపై 50శాతం మేరకు ఇది వర్తిస్తుంది. చెక్కులు, డీడీల ద్వారా విరాళం ఇవ్వాలి. నగదు రూపంలో ఇచ్చినప్పుడు రూ.10వేల వరకే అనుమతిస్తారు.
* సెక్షన్ 87ఏఏ రిబేట్: 2017-18 ఆర్థిక సంవత్సరంలో పన్ను వర్తించే ఆదాయం రూ.3,50,000లోపు ఉన్నప్పుడు ప్రత్యేక రిబేటు వర్తిస్తుంది. చెల్లించిన పన్నులో నుంచి రూ.2,500వరకూ వెనక్కి ఇస్తుంది ఆదాయపు పన్ను శాఖ.
* రూ.2,500 కన్నా తక్కువ పన్ను చెల్లిస్తే.. ఆ మేరకే మొత్తం వెనక్కి ఇస్తారు.
శ్లాబు రేటు...
రిటర్నులు దాఖలు చేసేప్పుడు మనం ఏ పన్ను శాతం పరిధిలోకి వస్తున్నామన్నదీ తెలుసుకోవాలి. 60 ఏళ్లలోపు వ్యక్తి ఆదాయం రూ.2,50,000 దాటినప్పుడు పన్ను పరిధిలోకి వస్తారు. రూ.2,50,000- రూ.5,00,000 వరకూ 5శాతం పన్ను వర్తిస్తుంది. రూ.5,00,001-రూ.10,00,000వరకూ 20శాతం పన్ను, రూ.10,00,001 ఆపైన 30శాతం పన్ను పరిధిలోకి వస్తారు. (80 ఏళ్లలోపు వారికి కనీస ఆదాయ పరిమితి రూ.3లక్షలు. 80 ఏళ్లు దాటిని వారికి కనీస ఆదాయ పరిమితి రూ.5లక్షలు).
ఏ పత్రం..
రిటర్నులు దాఖలు చేసేందుకు ఏ పత్రం ఎంచుకోవాలన్నదీ కీలకమే. ఆదాయపు పన్ను రిటర్నుల కోసం 7 ఫారాలు అందుబాటులో ఉన్నాయి. కానీ.. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఐటీఆర్ 1 (సహజ్), ఐటీఆర్ 2, ఐటీఆర్ 4 (సుగమ్) మాత్రమే ఎక్కువగా ఉపయోగపడతాయి.
ఐటీఆర్ 1: భారతదేశంలో నివసిస్తూ.. స్థూల వార్షికాదాయం రూ.50లక్షల లోపు ఉన్న మదుపుదారులు దీన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. వేతనం, పింఛను ద్వారా ఆదాయం. ఒక ఇల్లు ద్వారా ఆదాయం లేదా నష్టం వచ్చినప్పుడు ఈ ఫారాన్ని ఉపయోగించాలి. సాధారణంగా అధిక శాతం మందికి ఇదే వర్తిస్తుంది.
ఐటీఆర్ 2: స్థూల వార్షికాదాయం రూ.50లక్షలకు మించి ఉన్నప్పుడు, వేతనం, పింఛను ద్వారా ఆదాయం పొందుతున్న భారతీయ పౌరులు, ప్రవాస భారతీయులు, మూలధన రాబడి/నష్టం ఉన్నప్పుడు, వ్యవసాయ ఆదాయం రూ.5వేలకు మించి ఉన్నప్పుడు, ఒక ఇంటికి మించి ఉండి అద్దె ద్వారా ఆదాయం/ లేదా నష్టం వచ్చినప్పుడు. రూ.10లక్షలకు మించి డివిడెండ్ల రూపంలో అందుకున్నా.. ఐటీఆర్ 1 వర్తించే నిబంధనల్లో స్పష్టత లేకున్నా ఈ ఫారాన్ని ఎంచుకోవచ్చు.
ఐటీఆర్ 4: వృత్తి, వ్యాపారాదాయం కలిగిన వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు నిర్వహించే వ్యాపారాదాయాలకు ఇది వర్తిస్తుంది.
మర్చిపోకండి..
* మీ ఆదాయాలన్నీ కలిపి చూపించండి. ఆర్థిక సంవత్సరంలో ఒకటికి మించి ఉద్యోగాలు చేసినప్పుడు... ఆయా సంస్థల్లో వచ్చిన ఆదాయాలన్నింటినీ కలిపి లెక్కగట్టి, పన్ను రిటర్నులలో చూపించాలి.
* మినహాయింపులు ఏమైనా చూపించాల్సినవి ఉండీ, వాటిని మీ కార్యాలయంలో సకాలంలో సమర్పించినప్పుడు పన్ను కోత అధికంగా ఉండవచ్చు. అలాంటివేమైనా ఉంటే.. రిటర్నుల సందర్భంలో మినహాయింపు కోరండి. అయితే, వాటికి తగిన ఆధారాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూపించేందుకు సిద్ధంగా ఉండండి.
* రిటర్నుల దాఖలు సమయంలో హడావుడి పనికిరాదు. తప్పులు లేకుండా పూర్తి చేయండి. ఏ చిన్న అంకె తప్పు పోయినా మీ రిటర్నులు చెల్లకుండా పోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా.. బ్యాంకు ఐఎఫ్‌ఎస్‌సీ, బ్యాంకు ఖాతా సంఖ్య ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి.
* పీపీఎఫ్ తదితర పథకాల నుంచి వచ్చిన వడ్డీకి మినహాయింపు వర్తిస్తుంది. ఇలాంటి ఆదాయాలను మినహాయింపు పరిధిలోకి వచ్చే ఆదాయంగా పేర్కొనడం మర్చిపోవద్దు.
గుర్తుంచుకోండి...
జులై 31, 2018
ఉద్యోగులు 2017-18 ఆర్థిక సంవత్సరానికి రిటర్నులు దాఖలు చేయాల్సిన చివరి తేదీ. ఈ గడువు తేదీ దాటితే.. రిటర్నులు దాఖలు చేసేందుకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకూ అపరాధ రుసుము విధించే అవకాశం ఉంది.
డిసెంబరు 31, 2018
అపరాధ రుసుముతో రిటర్నులు దాఖలు చేసేందుకు ఈ తేదీ వరకూ వీలుంటుంది. అపరాధ రుసుము.. పన్ను వర్తించే ఆదాయం రూ.5లక్షలు దాటితే రూ.5వేలు. రూ.5లక్షల లోపు ఉంటే.. రూ.1,000.
మార్చి 31, 2019
2017-18 ఆర్థిక సంవత్సరం ఆదాయానికి సంబంధించి రిటర్నులు దాఖలు చేయడానికి చివరి తేదీ ఇది. జనవరి 1, 2019 తర్వాత రూ.10వేల అపరాధ రుసుముతో దాఖలు చేసే అవకాశం కల్పిస్తోంది ఆదాయపు పన్ను శాఖ. ఈ తేదీ తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఆదాయపు పన్ను శాఖ రిటర్నులు దాఖలు చేసేందుకు అవకాశం కల్పిస్తుంది.
* అసలు దాఖలు చేయకుంటే ఏం చేస్తారు? ఆదాయపు పన్ను శాఖ తీసుకునే చట్టపరమైన చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.
No comments:
Post a Comment