శ్రీ రామదాసు కీర్తనలు
Sri Ramadasu Keerthanalu
Rs 30/-
-------------------
మధుర వాక్కు
అనేకానేక జీవరాశుల్లో మాట కలిగిన వాడు మనిషి ఒక్కడే. సరైన సమయంలో, సరైన విధంగా మాట్లాడే మాటలతోనే మనిషి, జీవన సాఫల్యం పొందగల వీలుంది. శిక్షణతో మాటలు నేర్వడం వల్లే పక్షిజాతిలో చిలుక భిన్నమై, ముద్దులొలికే పలుకులతో మన మనసులను ఆకట్టుకుంటుంది. పసితనంలో పిల్లలు వచ్చీరాని మాటలతో పెద్దలను మురిపిస్తారు. వాళ్లు మనసులో ఏదీ దాచుకోరు. కల్లాకపటం తెలియనితనం అది.
పెద్దవుతున్న కొద్దీ- ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడుతూ, మనసులోని భావాలను సంపూర్ణంగా వ్యక్తం చేయకుండా, లౌక్యం ప్రదర్శిస్తారు. ఒకవేళ ఎవరైనా నిస్సంకోచంగా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే- బోళామనిషి, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో బొత్తిగా తెలియని వెర్రిబాగులవాడు అంటారు. యథార్థంగా మాట్లాడే వాళ్లకన్నా, మాట్లాడటంలో మర్మం చూపించే వాళ్లనే నమ్మేస్థితికి చేరుకున్నాం.
ఎదుటి మనిషిమీద మనకు మంచో చెడో ఒక అభిప్రాయం కలగడానికి కారణం- మాటే. మన వ్యక్తిత్వానికి చిరునామాగా నిలిచే మాటల్ని ఎంతో జాగ్రత్తగా ఆచితూచి ఉపయోగించాల్సి ఉంది.
మనం మాట్లాడే మాటలు అమృతం చిలకరించినట్లు ఉండాలే తప్ప, శరాల్లా మనసుల్ని గాయపరచకూడదని పెద్దలమాట. వినసొంపైన మాటే మంత్రంలా పనిచేేసి పదిమందినీ దగ్గరకు చేరుస్తుంది. పరుషమైన మాట తన అనుకున్న వాళ్లను దూరం చేస్తుంది. కాగల కార్యాలను అడ్డుకుంటుంది. వినదగునెవ్వరు చెప్పిన- అంటూ మాట్లాడటం కన్నా, వినడంలోనే వినయం ఉందని గురువులు చెబుతారు. మాట్లాడటంలో సమతుల్యత, సంయమనం ఉండాలన్నది అంతర్లీనార్థం.
మంచి మాటలు మాట్లాడితే అంతటా, అందరికీ మేలే కలుగుతుంది. చక్కగా మాట్లాడటాన్ని ఓ కళగా చెబుతారు. అరవై నాలుగు కళల్లో వాచకాన్ని చేర్చారు. ఎలాంటి మాటలు పొరపాటునైనా నోటి నుంచి వెలువడకూడదో మన పూర్వీకులు స్పష్టంగా విశదీకరించారు. ఎదుటివారితో కఠినంగా మాట్లాడటం, అసత్యం పలకడం, పితూరీలు చెప్పడం, అసందర్భ ప్రలాపం... వీటికి దూరంగా ఉంటే వాచలత్వాన్ని అదుపు చేసుకున్నట్టే.
భగవంతుణ్ని ప్రసన్నం చేసుకునే విధానంలోనూ మాటలదేపైచేయి.మంత్రాలు, శ్లోకాలు అన్నీ కమ్మని, వినసొంపైన మాటల సముదాయమే. బాధలకు తాళలేక కీర్తనల రూపంలో మొరపెట్టుకున్నా పెదవి విప్పని శ్రీరాముణ్ని పలుకే బంగారమాయెనా అంటూ సున్నితంగా నిలదీస్తాడు రామదాసు. అంతేకాక- ననూ బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లీ అంటూ తగిన సమయం చూసి, తన బాధను రామయ్య మనసు కరిగేలా విన్నవించమని అయోనిజనూ అర్థిస్తాడు. తిలకము దిద్దెరుగా, కస్తూరి తిలకము దిద్దెరుగా కలకలమను ముఖకళ గని సొక్కుచు పలుకులనమృతము లొలికెడు స్వామికి- అంటాడు త్యాగరాజు తన కీర్తనలో. మనసుతో వినగలగాలే కాని భగవంతుడివెప్పుడూ అమృత వాక్కులే!
మనోవాక్కాయ కర్మలను త్రికరణాలంటాం. మనసుతో ఆలోచించేది, నోటితో చెప్పేది, చేసే పని మూడూ ఏకోన్ముఖంగా ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా చేస్తే దానికి సత్ఫలితం ఉంటుందన్నది శాస్త్రం. అంటే మనసులోని భావాల సంచయం ముందుగా మాట అవుతుంది. తరవాత పనిగా రూపాంతరం చెందుతుంది. మాట కచ్చితంగా ఉంటే చేసే పని లోపరహితంగా ఉంటుంది. సర్వజనావళినీ తన గానంతో అలరించే కోకిల వసంతకాలం వచ్చేవరకు మౌనంగా వేచి ఉంటుంది అన్నది చాణక్య నీతి. సమయం వచ్చేవరకు పెదవి విప్పకపోవడం మన గౌరవాన్ని ఇనుమడింపజేస్తుంది. సందర్భోచితంగా సంభాషించడం, ఆ ఘనతను కాపాడుకుంటూ చేసే ప్రియవచనం, తన స్థాయికి శక్తికి తగ్గట్టుగా ప్రదర్శించే కోపం- ఇవి తెలుసుకున్నవాడు విజ్ఞుడు అంటాడు చాణక్యుడు.
మాట నిక్కచ్చిగా ఉండి, దానికి కట్టుబడి ఉండే మనిషిని సమాజం ఆదరిస్తుంది, అనుసరిస్తుంది. మాట విలువ తెలిసిన మనిషి పొదుపుగా, జాగ్రత్తగా ఉపయోగిస్తాడు. సమయానుకూలంగా తన వాక్కుల్లో నవరసాలూ వ్యక్తం చేసే వ్యక్తి- మాట విలువ తెలిసిన మహనీయుడు, మాననీయుడు. - ప్రతాప వెంకట సుబ్బారాయుడు
No comments:
Post a Comment