Saturday, June 30, 2018

ప్రతి పనికీ ఉందో ‘ఆప్‌’ | ఆండ్రాయిడ్‌, ఆపిల్‌ ఆప్‌స్టోర్‌లలో! | Mobile app | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu


A mobile app is a computer program designed to run on a mobile device such as a phone/tablet or watch.  ప్రతి పనికీ ఉందో ‘ఆప్‌’ | ఆండ్రాయిడ్‌, ఆపిల్‌ ఆప్‌స్టోర్‌లలో! | Mobile app | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu Mobile App Android Apple IOS Mac OS Mobile Sale Google Play Store Play store Iphone Store Istore

ప్రతి పనికీ ఉందో ‘ఆప్‌’ | ఆండ్రాయిడ్‌, ఆపిల్‌ ఆప్‌స్టోర్‌లలో! | Mobile app | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

ప్రతి పనికీ ఉందో ‘ఆప్‌’!

   ఇంట్లో సరుకులూ కూరగాయలూ లేవు... పర్వాలేదు, ఫోన్‌ ఉందిగా! ఫ్రెండ్స్‌ వచ్చారు, వంట చేసే టైమ్‌ లేదు... కంగారు ఎందుకు, స్విగ్గీ ఆప్‌ ఉంది. అర్జంటుగా బంధువులింటికి వెళ్లాలి, బయట వర్షం... ఇబ్బంది లేదు, ఆప్‌ ఉంటే నిమిషాల్లో కారు ఇంటి ముందుకొస్తుంది. పక్కింట్లో పెద్దాయనకి సీరియస్‌, అర్జంటుగా ఆస్పత్రికి తీసుకెళ్లాలి... ఒక్క క్షణం, ఫోనులో అంబులెన్స్‌ బుక్‌ చేద్దాం. స్మార్ట్‌ఫోను ఒక్కటి చేతిలో ఉంటే చాలు, వేలికొసలతో నిమిషాల్లో పనులు చేసిపెడుతున్నాయి ఆప్‌లు. అసలు ఏమిటీ ఆప్‌లు? ఫోనులోకి ఎలా వస్తున్నాయి?

ఫోన్‌ అలారం మోతతో నిద్రలేచారు. చెరో ఫోన్‌ తీసుకుని వాట్సాప్‌ గ్రూపుల్లో గుడ్‌మార్నింగ్‌ చెప్పారు. ఆయన న్యూస్‌ఆప్‌లో వార్తల హెడ్‌లైన్లు చూసుకున్నాడు. మొహం కడుక్కుని వచ్చిన ఆమె కాఫీ కలుపుతోంటే ఫోను మోగింది. ఇవాళ అన్నావదినల పెళ్లి రోజు. మొన్న తాను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసిన బొకే పొద్దున్నే అందిందని అన్నయ్య థ్యాంక్స్‌ చెప్పాడు. కాసేపు వాళ్లతో మాట్లాడింది. ఇద్దరూ కలిసి యూట్యూబ్‌లో చూసి వంట పని కానిచ్చారు. టిఫిన్‌ తింటూనే ఆఫీసు గ్రూప్‌లో అప్‌డేట్స్‌ చెక్‌ చేసుకున్నారు. ఆఫీస్‌ క్యాబ్‌ లైవ్‌ లొకేషన్‌ చూసుకుని ఇంటికి తాళం వేసి రోడ్డు మీదికి వచ్చారు. కారులో కూర్చుని కావలసిన సరుకుల్ని ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చిందామె. బ్లూటూత్‌ చెవికి పెట్టుకుని అతడు బైక్‌మీద ఆఫీసుకు వెళ్లిపోయాడు. రాత్రి పడుకోబోయేటప్పుడు ఛార్జింగ్‌కి పెట్టేవరకూ అలా ఇద్దరి ఫోనుల్లో రకరకాల ఆప్‌లు పనిచేస్తూనే ఉంటాయి.

పదేళ్ల క్రితం ‘ఆప్‌’ అన్న మాటే లేదు. ఇప్పుడేమో ఏదో ఒక ఆప్‌ వాడనిదే గంట గడవదు. ఈ పరిస్థితిని మూడున్నర దశాబ్దాల క్రితమే ఊహించాడు స్టీవ్‌ జాబ్స్‌. అంతర్జాల సదుపాయంతో ఐఫోన్‌నీ, 500 ఆప్‌లతో ఆప్‌స్టోర్‌నీ ప్రారంభించి తన ఊహని తానే నిజం చేసి చూపించాడు.

తొలి ఆప్‌ పాముల ఆటే! 
90వ దశకం చివర్లో నోకియా 6110 ఫోనులో పెట్టిన స్నేక్‌గేమ్‌ మొబైల్‌ఫోన్‌లో చేరిన తొలి ఆప్‌. దాంతో మొబైల్‌ ఫోను ఫీచరు ఫోన్‌గా మారడం మొదలైంది. ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌, ఆప్‌స్టోర్‌ల రంగ ప్రవేశంతో అది స్మార్ట్‌ ఫోన్‌ అయింది. ఇప్పుడిది కేవలం ఫోన్‌ కాదు, కంప్యూటరుతో పని లేకుండా అవసరమైన సౌకర్యాలనెన్నిటినో ఆప్‌ల రూపంలో మనచేతిలోకి తెచ్చిన సాధనం. మొబైల్‌లో పనిచేసేలా రూపొందించిన కంప్యూటర్‌ అప్లికేషన్‌నే వాడుకభాషలో ‘ఆప్‌’ అంటున్నాం. వీటిని ఫోనులోకి డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి ఆప్‌స్టోర్‌ ఉంటుంది. ఒకటీ రెండూ కాదు, గత పదేళ్లలోనే కొన్ని లక్షల ఆప్‌లు తయారయ్యాయి. వ్యక్తిగత అవసరాలకు పనికొచ్చేవీ, వ్యాపారాభివృద్ధికి తోడ్పడేవీ, సమాజసేవను ప్రోత్సహించేవీ, వినోదాన్ని పంచేవీ... ఇలా లక్షలాది ఆప్‌లు స్టోర్స్‌లో సిద్ధంగా ఉన్నాయి. ఇవి మన నిత్యజీవితాలను ఎంతగా 
మార్చేశాయంటే అసలు ఇన్నాళ్లూ ఇవి లేకుండా ఎలా ఉన్నామో అన్పిస్తుంది.

సామాజిక బంధాలు! 
అబ్బాయికి మెడిసిన్‌లో సీటొచ్చింది. వాట్సాప్‌ ఫ్యామిలీ గ్రూప్‌లో ఆ మాట పెడితే బంధువులందరికీ క్షణాల్లో వార్త చేరిపోతుంది. అభినందనలు వెల్లువెత్తుతాయి. అప్పుడిక పుత్రోత్సాహం ఎన్ని రెట్లవుతుందో చెప్పతరమా! అదే ఒకప్పుడైతే ప్రతివారికీ పేరుపేరునా ఫోను చేసి చెప్పాల్సి వచ్చేది. సోషల్‌ మీడియా ఆప్స్‌ అనుబంధాలను పెనవేస్తూ సంఘజీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. కష్టసుఖాలు పంచుకోవడానికి మాధ్యమాలవుతున్నాయి. స్నేహితులెవరో ఆస్పత్రిలో ఉన్నారు. అర్జెంటుగా రక్తం కావాలి. ఒక్క ట్వీట్‌ లేదా ఫేస్‌బుక్‌లో ఒక్క పోస్టు చాలు, నిమిషాల్లో అవసరం తీరే మార్గం దొరుకుతుంది. సంఘజీవి అయిన మనిషి బలమూ బలహీనతా కూడా ఆ సంఘమే. పదిమందిలో తనకంటూ ఒక గుర్తింపు కోరుకోనివారుండరు. అందుకే సోషల్‌ మీడియా ఆప్స్‌ ఆదరణలో తొలి స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి.

కోరుకున్నవి ఇంటి వద్దకే... 
సంచీ పట్టుకుని బయటికెళ్లే పని లేకుండా తాజా కూరగాయలన్నీ పొద్దున ఏడింటికల్లా ఇంటికి వస్తే- ఉరుకులు పరుగులతో వంట చేసే ఇల్లాలికి అంతకన్నా ఆనందం ఏముంటుంది? బిగ్‌ బాస్కెట్‌ లాంటి ఆప్‌ ఉంటే అది సాధ్యమే. నగరజీవికి ఆఫీసుకు వెళ్లిరావడమంటే పది, పన్నెండు గంటల ప్రహసనం. అలసిపోయి ఇంటికొస్తే మళ్లీ ఏ సరుకులో, కూరగాయలో కావాలంటే మరో గంట కష్టం. ఫోనులోని ఆప్‌ ద్వారా ఆర్డరిస్తే కావలసిన వస్తువులన్నీ ఇంటికొస్తాయి. సమయమూ కలిసొస్తుంది. శ్రమా తప్పుతుంది. వంట చేసే ఓపికో, సమయమో లేనప్పుడు ఫుడ్‌ డెలివరీ ఆప్స్‌ ఆ ఇబ్బందిని గట్టెక్కిస్తాయి. పిజ్జాలూ బర్గర్లే కాదు ఏ హోటల్‌ నుంచి ఏ పదార్థం కావాలన్నా ఆర్డరిచ్చేందుకు స్విగ్గీ లాంటి ఆప్స్‌ ఉన్నాయి. హోటల్‌ వంటలు పడవు, ఇంటి వంటే కావాలన్నా మార్గం ఉంది. వాట్స్‌కుకింగ్‌ లాంటి ఆప్స్‌ ఆ పని చేసి పెడతాయి. ఇళ్లల్లో వంటలు చేయించి అవసరమైనవారికి సరఫరా చేయడానికి వెలసిన ఇలాంటి స్టార్టప్‌ల ఆప్స్‌ ఎక్కడికక్కడ బోలెడున్నాయి.

జీపీఎస్‌ అండ...

భార్యాభర్తలిద్దరికీ ఆఫీసులో సెలవు దొరకలేదు. అమ్మాయిని ఒంటరిగా ఊరు పంపించాలి. అయినా భయం లేదు. ఆర్టీసీ బస్సుకైనా ప్రైవేటు బస్సుకైనా టి·క్కెట్టు ఫోనులోనే తీసుకోవచ్చు. ఏ సీటు కావాలో ఎంచుకోవచ్చు. క్యాబ్‌ బుక్‌ చేస్తే బస్టాండుకి కూడా తనే వెళ్లిపోగలదు. చేయాల్సిందల్లా ఫోనులో జీపీఎస్‌ ఆన్‌ చేసి లైవ్‌ లొకేషన్‌ మరో ఫోనుతో షేర్‌ చేయడమే. ఇంట్లో బయల్దేరినప్పటినుంచి గమ్యం చేరుకునేవరకూ ఆమె ప్రయాణాన్ని అమ్మోనాన్నో ఇంటినుంచే పర్యవేక్షించవచ్చు. బస్సుకే కాదు రైలు టిక్కెట్టు తీసుకోవాలన్నా, క్యాన్సిల్‌ చేసుకోవాలన్నా, రైల్లో వెళ్లేటప్పుడు భోజనం ఆర్డరివ్వాలన్నా... ఇలా ప్రతి పనికీ ఓ ఆప్‌ ఉంది. ఒకప్పుడు ఏ పరీక్ష రాయడానికో హైదరాబాద్‌ వస్తే సందుల్లో గొందుల్లో తిరిగి చిరునామా వెదుక్కునేసరికి తాతలు దిగివచ్చేవారు. గూగుల్‌ మ్యాప్స్‌ ఆప్‌తో ఫోనే ఇప్పుడు దారి చూపిస్తుంది. 
నగరాల్లోనే కాదు, ట్రెకింగ్‌ లాంటి సాహసయాత్రలకు వెళ్లేవారూ దారి తప్పిపోకుండా కాపాడుతోంది ఈ ఆప్‌.

అరచేతిలో ఆన్‌లైన్‌ దుకాణం

ఒకప్పుడు షాపింగ్‌ అంటే పెద్ద ప్రహసనం. ఎవరో ఒకరు తోడుండాలి. వెళ్లిరావడానికీ ఇష్టమైన వస్తువులు ఎంచుకోవడానికీ బోలెడు సమయం కావాలి. ఇప్పుడది నిమిషాల పని. చేతిలో ఫోను ఉంటే బట్టల నుంచీ బంగారం వరకూ కుర్చీలోనుంచి కదలకుండానే కొనుక్కోవచ్చు. ఆన్‌లైన్లో షాపింగ్‌ అంటే కొత్తలో చాలామంది భయపడేవారు. సైజూ నాణ్యతా ఖరీదూ- అన్నిటిగురించీ అనుమానాలు వేధించేవి. వ్యాపారసంస్థల మధ్య పోటీ ఆ సందేహాలనన్నిటినీ పటాపంచలు చేసింది. ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఆప్స్‌ ఒకదాన్ని మించి మరొకటి అన్నట్లుగా తయారయ్యాయి. ఎన్నో వెసులుబాట్లు ఉంటున్నాయి కాబట్టే యువతరం స్మార్ట్‌ఫోన్‌తో ఎక్కువ సమయాన్ని ఆన్‌లైన్‌ షాపింగ్‌కే కేటాయిస్తోంది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ లాంటి ఆప్స్‌ అన్ని బ్రాండ్ల వస్తువుల్నీ అమ్ముతుండగా పలు సంస్థలు సొంత ఆప్‌లను తయారుచేసుకుని ఆన్‌లైన్‌ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఒక్క దుస్తులే కాదు, వంట సామగ్రి నుంచి మంచాలవరకూ, సెల్‌ఫోన్‌ నుంచి ఫ్రిజ్‌ వరకూ అన్నీ ఆన్‌లైన్లో కొనుక్కోవచ్చు.

క్యాబ్‌ సర్వీసూ ఆప్‌ వరమే! 
ఆప్‌తో వచ్చిన మరో అతి ముఖ్యమైన సౌకర్యం- క్యాబ్‌ సర్వీసులు. సమయానికి రాని ఆర్టీసీ బస్సులతో, మీటర్లు లేని ఆటోలతో అవస్థపడినవారికి ఈ సౌకర్యం వరమే. వ్యక్తిగత రవాణా విషయంలో ఇదో సంచలనం. సొంత వాహనం లేకపోయినా, డ్రైవింగ్‌ రాకపోయినా సుఖంగా కారులో తిరగొచ్చు. మొబైల్‌ ఆప్‌లో బుక్‌ చేస్తే నిమిషాల్లో ఇంటి ముందు కారు సిద్ధంగా ఉంటుంది. ప్రయాణానికి ఎంత ఖర్చవుతుందో ముందే తెలిసిపోతుంది. గమ్యానికి చేరుకునే మార్గాన్నీ ఫోనులో చూడవచ్చు. భద్రత కోసం కుటుంబసభ్యులతో ఆ వివరాలను పంచుకునే వీలూఉంది. కార్లే కాదు చిన్న చిన్న దూరాలకోసం ఆటోలను సైతం ఇప్పుడు ఆప్‌ ద్వారా తెప్పించుకోవచ్చు.

ఆప్‌ తోడుగా నగదు రహితం 
వేరే ఊళ్లో హాస్టల్లో ఉండి చదువుకుంటున్న అబ్బాయికి ఫీజు కట్టాలంటే ఒకప్పుడు మనియార్డర్‌ పంపించేవాళ్లం. అది వాళ్లకు చేరి నగదుగా మారడానికి వారం రోజులు పట్టేది. ఇప్పుడు నిమిషాల్లో మన ఖాతా నుంచి వారి ఖాతాకి డబ్బు వెళ్లిపోతుంది. రూపాయి చేత్తో ముట్టుకోకుండా ఆర్థిక లావాదేవీలు జరపడం ఒకప్పుడు ఊహకందని విషయం. ఇప్పుడు మన ఖాతా ఉన్న బ్యాంక్‌ ఆప్‌ను ఫోనులోకి డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలు, డబ్బు ముట్టుకోకుండానే అన్ని పనులూ చేసేయొచ్చు. బిల్లులన్నీ ఆన్‌లైన్లో చెల్లించవచ్చు. ఎవరికన్నా డబ్బు ఇవ్వాల్సివస్తే వారి ఖాతాలకు నేరుగా క్షణాల్లో బదిలీ చేయవచ్చు. బ్యాంకు పనులే కాదు, స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ కూడా ఫోనుతో సాధ్యం చేస్తున్నాయి మనీకంట్రోల్‌, స్టాక్‌వాచ్‌, కైట్‌ లాంటి ఆప్‌లు.

వార్తలూ ఆటలూ అన్నిటికీ ఫోనే! 
ఉదయం వచ్చే పేపరులోనో, రాత్రి ఇంటికి చేరుకున్నాక చూసే టీవీలోనో వార్తలు తెలుసుకునే రోజులు కావివి. ఫోన్‌లో న్యూస్‌ఆప్‌ ఉంటే చాలు ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో తెలుసుకోవచ్చు. ప్రతి వార్తాసంస్థకీ ఇప్పుడు సొంత న్యూస్‌ఆప్‌లు ఉంటున్నాయి. అవే కాకుండా అన్ని సోర్సులనుంచీ వార్తలను సమీకరించి ఇచ్చే ఫీడ్లీ, ఫ్లిప్‌బోర్డ్‌, న్యూస్‌రిపబ్లిక్‌, పాకెట్‌ లాంటి ఆప్స్‌కి మంచి ఆదరణ లభిస్తోంది. ఆప్‌ల ద్వారా యువతనీ పిల్లల్నీ ఆకట్టుకుంటున్న మరో రంగం గేమ్స్‌. గత ఏడాది ఎక్కువగా డౌన్‌లోడ్‌ అయిన గేమ్స్‌లో పోకెమాన్‌, సూపర్‌ మారియోరన్‌ లాంటి ఆటలతో పాటు బాహుబలి గేమ్‌ కూడా ఉంది.

టీచ‌ర్లూ ఆప్‌లే! 
పుస్తకం లేకుండా చదువుకోవడమూ, బ్లాక్‌బోర్డు లేకుండా పాఠం చెప్పడమూ కూడా ఫోనుతో సాధ్యమే. అవును. యూట్యూబ్‌ వీడియోలే ఇప్పుడు టీచర్లు. సైన్సూ లెక్కలూ... ఏ సబ్జెక్టైనా సరే. చక్కగా ఒక్కో పాయింటూ వివరిస్తాయి. ఏదైనా సందేహం వస్తే అక్కడే టైప్‌ చేయొచ్చు. వెంటనే సమాధానమూ వస్తుంది. నీట్‌ పరీక్ష రాసేవారికి ఖాన్‌ అకాడమీ, సివిల్‌ సర్వీస్‌ పరీక్షలు రాసేవారికి అన్‌అకాడమీ, స్కూలు, కాలేజీ విద్యార్థులకు పాఠాలు చెప్పే బైజూ... ఇలా ఎన్నో ఆప్‌లు ఆన్‌లైన్లో పాఠాలు 
చెబుతున్నాయి. పోటీ పరీక్షలకు తగిన పాఠ్యాంశాలూ సలహాలూ సూచనలతో చాలా ఆప్స్‌ ఉచితంగానే సేవలందిస్తున్నాయి. మెరిట్‌నేషన్‌, టాప్‌ర్యాంకర్స్‌, సింప్లీలెర్న్‌, ఒకాబులరీ, మ్యాథ్‌ట్రిక్స్‌ లాంటివన్నీ అలాంటివే.


టాప్‌ టెన్‌ ఆప్స్‌ ఇవే!


ఉచితంగా లక్షలాది ఆప్‌లు అందుబాటులో ఉండగా వాటిలో అత్యంత ప్రజాదరణతో ఫేస్‌బుక్‌ ప్రథమ స్థానాన్ని కొట్టేసింది. స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల్లో 81 శాతం దీన్ని వాడుతున్నారు. టాప్‌టెన్‌లో దాని తర్వాత స్థానాల్లో యూట్యూబ్‌, ఎఫ్‌బీ మెసెంజర్‌, గూగుల్‌ సెర్చ్‌, గూగుల్‌ మ్యాప్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌, స్నాప్‌చాట్‌, గూగుల్‌ప్లే, జీమెయిల్‌, పండోరా ఉన్నాయి. కుర్రకారు దగ్గరికి వచ్చేసరికి ఈ జాబితా మారిపోతోంది. అందరూ అనుకుంటున్నట్లు వారు ఎక్కువగా వాడేది ఇన్‌స్టాగ్రామో, స్నాప్‌చాటో కాదు, అమెజాన్‌! స్మార్ట్‌ఫోన్‌ వినియోగంలో 35 శాతాన్ని ఇది ఆక్రమిస్తోంది. దాని తర్వాత స్థానాల్లో జీమెయిల్‌, ఫేస్‌బుక్‌, మెసెంజర్‌ యూట్యూబ్‌ ఉన్నాయి.


ఇంటికే డాక్టరు!

ఒకప్పుడు ఫ్యామిలీ డాక్టర్లు ఉండేవారు. అవసరమైనప్పుడు ఇంటికే వచ్చి చూసేవారు. ఇప్పుడు మళ్లీ ఆ సౌకర్యాన్ని ఆప్‌లు తెచ్చాయి. వృద్ధులూ, దీర్ఘవ్యాధులతో బాధపడుతున్నవారూ ఇంట్లో ఉంటే వారికి క్రమం తప్పకుండా వైద్య సదుపాయం కల్పించడం కత్తి మీద సామే. ఇటు ఉద్యోగ, కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ వారిని ఆస్పత్రుల చుట్టూ తిప్పాలంటే ఎవరికైనా సమయం సరిపోదు. అందుకే ఇప్పుడు వైద్యసేవలే ఇంటికి వస్తున్నాయి. స్థానికంగా సేవలందిస్తున్న ఆప్‌లను ఎంచుకుని ఫోనులో ఆర్డరు చేస్తే చాలు. చిన్న చిన్న వైద్యపరీక్షలు చేయడం, అవసరమైన మందుల్ని ఇంటికే తెచ్చివ్వడం, వైద్యసేవలకు సిబ్బందిని ఏర్పాటుచేయడం లాంటి సౌకర్యాలను ఈ ఆప్స్‌ కల్పిస్తాయి. పోర్షియా, 1ఎంజి, నెట్‌మెడ్స్‌, ఫార్మ్‌ఈజీ లాంటి హెల్త్‌కేర్‌ ఆప్స్‌ ఎన్నో అందుబాటులో ఉన్నాయి.

పెళ్లిపెద్దలుగా... 
అమ్మానాన్నా హైదరాబాదులో ఉన్నారు. అబ్బాయికి ఆస్ట్రేలియాలో ఉద్యోగం. ఇంట్లో కంప్యూటరు లేక ఆన్‌లైన్లో పెళ్లి సంబంధాల కోసం ఇంటర్నెట్‌ సెంటర్ల చుట్టూ తిరగాల్సివచ్చేది. అక్కడ వాళ్లు చూపించిన ప్రొఫైల్స్‌లో నచ్చినవాటి వివరాలు నోట్‌ చేసుకోవడం, ఇంటికొచ్చి అవన్నీ కుటుంబ సభ్యులకు చూపించడం, ఫోనులో అబ్బాయికి చెప్పడం, అందులో మళ్లీ అతనికి నచ్చిన ప్రొఫైల్స్‌ నంబర్లు నోట్‌చేసుకుని వాళ్లకు ఫోన్‌ చేసి మాట్లాడడం... అదో ఎడతెగని వ్యవహారంలా ఉండేది. ఇప్పుడు ఆ సంస్థలన్నీ ఆప్‌లను అందుబాటులోకి తేవడంతో ఇంట్లో ఉండి ఫోనులోనే పెళ్లి సంబంధాల ప్రొఫైల్స్‌ చూసుకునే వెసులుబాటు లభిస్తోంది. అమ్మాయీ అబ్బాయీ కూడా నేరుగా వాట్సాప్‌లో మాట్లాడుకుంటున్నారు. దీనివల్ల వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న తల్లిదండ్రులూ పిల్లల మధ్య కమ్యూనికేషన్‌ తేలికయింది. సమయమూ కలిసొస్తోంది.

ప్రభుత్వాలకీ ఉన్నాయి!



ప్రభుత్వ సేవల్ని ప్రజలకు దగ్గర చేయడానికీ ఎన్నో ఆప్‌లు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కొత్త ఆప్‌లతో ప్రజలకు చేరువవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆధార్‌, డిజిలాకర్‌, పేగవ్‌ లాంటి పలు ప్రభుత్వ సేవల్ని ఒకే వేదిక మీద అందించే ‘ఉమంగ్‌’, పాస్‌పోర్ట్‌కి సంబంధించిన వివరాలు తెలిపే ‘ఎంపాస్‌పోర్ట్‌’, పౌరులెవరైనా ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడానికి పనికొచ్చే ‘మైగవ్‌’, డేటా స్పీడ్‌ తదితర వివరాలకోసం ‘మైస్పీడ్‌’, డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించే ‘భీమ్‌’... కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆప్స్‌లో ముఖ్యమైనవి. 

ప్రభుత్వ సేవలు అన్నీ ఒకే వేదిక మీద లభించేలా తెలంగాణ ప్రభుత్వం ‘టీ ఆప్‌ ఫోలియో’ను ప్రారంభించింది. మీసేవ, ఆర్టీఏ సేవలు, పలు బిల్లుల చెల్లింపులు దీనితోనే చేయవచ్చు. ప్రస్తుతం 150 దాకా సేవలను అందిస్తున్న ఈ ఆప్‌ పరిధిని అన్ని సేవలకూ విస్తరించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ స్టోర్‌లోనూ చాలా ఆప్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వానికీ ప్రజలకు మధ్య వారధిలా పనిచేసే ‘పీపుల్‌ ఫస్ట్‌’ ఆప్‌ ద్వారా ప్రభుత్వ పథకాల వివరాలు తెలుసుకోవచ్చు. పలు ఈ-సర్టిఫికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్‌ అభివృద్ధి చేసిన కైజాలా అనే ఆప్‌ని కూడా ఏపీ ప్రభుత్వం వినియోగిస్తోంది. దీని ద్వారా ప్రజలు నేరుగా ప్రభుత్వానికి సూచనలు ఇవ్వవచ్చు.


రైతన్నకు అండ 
మారుమూల పల్లెలో ఉన్న రైతు తన పొలంలో భూసారం ఎలా ఉందో, ఏ పంట బాగా పండుతుందో, మార్కెట్లో దేనికి గిరాకీ ఉందో... లాంటి సమాచారమంతా పొందగలుగుతున్నాడంటే ‘కిసాన్‌సువిధ’ లాంటి ఆప్‌ల చలవే. ఆ ఆప్‌ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. స్మార్ట్‌ఫోన్‌లో తమ మాతృభాషలో రైతులు ఇప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నారు. పంటలకు సోకిన తెగుళ్ల గురించి ఫొటో తీసి పంపితే దానికి ఏ మందులు వాడాలో చెప్పే ఆప్స్‌ ఉన్నాయి. ఒకే పంట వేసిన రైతులందరూ పంటకు సంబంధించిన సమాచారాన్ని పంచుకుని లబ్ధి పొందడానికి తోడ్పడుతుంది సీసీమొబైల్‌ ఆప్‌. క్రిమిసంహారకమందుల్ని ఏ మోతాదులో ఎక్కడెక్కడ ఎలా వాడాలో చెబుతుంది స్ప్రేగైడ్‌ ఆప్‌. ఇఫ్కోకిసాన్‌ ఆప్‌ ద్వారా రైతులు తమ సందేహాలను వ్యవసాయ శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకోవచ్చు.

ఆఖరి మజిలీకీ ఓ ఆప్‌ 
ఆప్తులు ఎవరైనా పోతే అంతులేని దుఃఖంలో ఉంటాం. అదే సమయంలో వారి అంత్యక్రియల ఏర్పాట్లూ చేయాలంటే నగరంలో నివసించేవారికి చాలా కష్టం. ఏ వస్తువులు ఎక్కడ దొరుకుతాయో, శ్మశానం ఎక్కడ ఉందో తెలియదు. అంతిమసంస్కారాల విధివిధానాలూ తెలియక చాలామంది ఇబ్బందిపడడమూ తెలిసిందే. ఫలితంగా అందుబాటులోకి వచ్చాయి మోక్షశీల్‌, శ్రద్ధాంజలి, కాశీమోక్ష, అంత్యేష్టి లాంటి ఆప్‌లు. వీటిల్లో శ్మశానాలూ, అంతిమసంస్కారాలు నిర్వహించే పండితుల సమాచారం తదితర వివరాలే కాక అన్ని బాధ్యతలూ వారే తీసుకుని నిర్వహించేలా వేర్వేరు ప్యాకేజీలూ అందుబాటులో ఉన్నాయి. అంత్యక్రియలతో ముగించకుండా ఆ తర్వాత స్మారక కార్యక్రమాల ఏర్పాటు కూడా ఆప్స్‌ చేపడుతున్నాయి. ఆప్తుల సంతాప సందేశాలూ, ఫొటోలతో డిజిటల్‌ ఆల్బమ్‌లు తయారుచేస్తున్నాయి.

ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. చెప్పాలంటే ప్రతి పనికీ ఓ ఆప్‌ ఉంది. చేయాల్సిందల్లా గూగుల్‌లో వెదుక్కోవడమే. లక్షలాది ఆప్స్‌ అందుబాటులో ఉండడమే కాదు, అదే స్థాయిలో ప్రజలూ వాటిని 
వినియోగించుకుంటున్నారు.

గంటకు వంద! 
ఆప్‌లతో ఉన్న వెసులుబాటు ఏమిటంటే... ఎవరి అవసరానికి తగినట్లుగా వారు కొత్త ఆప్‌ను తయారుచేయించుకోవచ్చు. ప్రస్తుతం గంటకు 100, రోజుకు 2500 కొత్త ఆప్‌లు తయారవుతున్నట్లు అంచనా. ఆప్‌లను అభివృద్ధి చేయడమూ ఈనాటి ఆకర్షణీయ కెరీర్‌లలో ఒకటి. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ ద్వారా సేవలందిస్తున్న ఈ ఆప్‌లన్నీ భవిష్యత్తులో వేరబుల్‌ టెక్నాలజీలో భాగమై మనిషి శరీరం మీదికే చేరిపోతాయంటున్నారు నిపుణులు. ఇప్పటికే గూగుల్‌ గ్లాస్‌, ఆపిల్‌ స్మార్ట్‌వాచ్‌లు ఆ పని చేస్తున్నాయి. నేడు డిజిటల్‌మీడియా వినియోగంలో సగానికి పైగా భాగస్వామ్యం ఆప్‌లదేననీ, ఇంకా ఎన్నో అద్భుతాలను ఆప్‌ల ద్వారా ఆవిష్కరించేందుకు రంగం సిద్ధమవుతోందనీ అంటున్నారు నిపుణులు.

* * *

ఆండ్రాయిడ్‌, ఆపిల్‌ ఆప్‌స్టోర్‌లలో కలిపి ప్రస్తుతం 66 లక్షల పైచిలుకు ఆప్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొబైల్‌ ఆప్‌ రెవెన్యూ 2015లో 4,74,134 కోట్ల రూపాయలు. 2020నాటికి ఇది 12లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. ఆప్‌లు మన జీవితంలో ఎంత కీలకంగా మారాయో దీన్నిబట్టి అర్థమవుతోంది కదా! *

No comments:

Post a Comment